Harish Rao: కాళేశ్వరం కొట్టుకుపోతే.. 21 టీఎంసీల నీరెలా వచ్చింది?
ABN , Publish Date - Sep 21 , 2024 | 04:05 AM
‘కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుపోయిందని గోబెల్స్ ప్రచారం చేశా రు. అలా అయితే.. మల్లన్నసాగర్‌లో ఈ రోజు 21 టీఎంసీల నీరు ఎక్కడి నుంచి వచ్చింది?
సముద్రంలా మల్లన్నసాగర్
ఇప్పటికైనా కాంగ్రెసోళ్లు అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: హరీశ్
తొగుట/దుబ్బాక, సెప్టెంబరు 20: ‘కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుపోయిందని గోబెల్స్ ప్రచారం చేశా రు. అలా అయితే.. మల్లన్నసాగర్‌లో ఈ రోజు 21 టీఎంసీల నీరు ఎక్కడి నుంచి వచ్చింది? కాళేశ్వరం పేర లక్ష కోట్లు వృథా అయ్యాయన్న కాంగ్రెస్ నేతల మాటలు అబద్ధమని సముద్రాన్ని తలపిస్తున్న మల్లన్నసాగర్ చాటుతోంది’ అని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్ర వారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ శివారులో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ఆయన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు వెంకట్రామారెడ్డి, యాదవరెడ్డి, దేశపతి శ్రీనివా్‌సతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా గోదావరి జలాలకు పూలు చల్లి పూజలు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మా ట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఎల్లంపల్లి, లక్ష్మీ బ్యారేజీ, అన్నపూర్ణ, రంగనాయక్‌సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయని చెప్పా రు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు మల్లన్నసాగర్‌లో పసుపు కుంకుమ వేసి, కొబ్బరికాయలు కొట్టాలని, అప్పుడే వాళ్ల పాపాలు తొలగిపోతాయన్నారు. కేసీఆర్ కల ఫలించిందని, కాలువలు 90ు పూర్తయ్యాయని, మిగతా 10ు కాల్వలను కాంగ్రెస్ నేత లు పూర్తిచేసి పొలాలకు నీరందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్‌ఎస్ నాయకురాలు కత్తికార్తీక ఫౌండేషన్ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్‌మండపంలో హరీ శ్ పూజలు చేశారు. ఈ సందర్భంగా గర్భిణులకు ‘మాఇంటి మహాలక్మి’ పేరిట కార్తీక ఫౌండేషన్ అం దించనున్న న్యూట్రిషన్ కిట్లను ప్రారంభించారు.
హరీశ్ గోబ్యాక్.. తుక్కాపూర్ గ్రామస్థుల నిరసన
మల్లన్నసాగర్ రిజర్వాయర్ సందర్శనకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం వస్తున్నట్లు సమాచారం అందుకున్న తొగుట మండలం తుక్కాపూర్ గ్రామస్థులు శుక్రవారం ఉదయాన్నే కట్టపైకి చేరుకుని అక్కడ బైఠాయించారు. హరీశ్‌రావు గోబ్యాక్ అంటూ ఫ్లకార్డులు, బ్యానర్‌లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సుమారు 3 గంటల పాటు గ్రామస్థులు నిరసనలు తెలపడంతో వారికి కాంగ్రెస్ నేతలు సంఘీభావం ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ గ్రామాన్ని నట్టేట ముంచిన హరీశ్‌రావు రిజర్వాయర్ నిర్మాణం సందర్శనకు ఎలా వస్తారని ప్రశ్నించారు. హరీశ్ పర్యటనను అడ్డుకుంటామని వారు తేల్చిచెప్పడంతో గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి నేతృత్వంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.