High Court: హరీశ్‌రావును అరెస్టు చేయొద్దు
ABN , Publish Date - Dec 06 , 2024 | 03:14 AM
ఫోన్ ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో హరీశ్‌రావును అరెస్టు చేయరాదని.. కేసును యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చని పోలీసులకు హైకోర్టు స్పష్టంచేసింది.
దర్యాప్తు కొనసాగించవచ్చు: హైకోర్టు
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసులో బీఆర్‌ఎస్ నేతకు ఊరట
గోప్యత ప్రాథమిక హక్కు.. దానిని ఉల్లంఘించారు: ప్రభుత్వం
హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో హరీశ్‌రావును అరెస్టు చేయరాదని.. కేసును యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చని పోలీసులకు హైకోర్టు స్పష్టంచేసింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్ హరీశ్‌రావుకు సూచించింది. హరీశ్‌రావుపై కేసు పెట్టిన ఫిర్యాదుదారుడు చక్రధర్‌గౌడ్ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక.. అక్రమంగా క్రిమినల్ కేసుల్లో ఇరికించడంతోపాటు, తన ఫోన్‌ను ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తూ జి.చక్రధర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 1న పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే..! ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై కేసు నమోదు చేయడాన్ని హరీశ్‌రావు సవాల్ చేస్తూ.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలను వినిపించారు. చక్రధర్‌గౌడ్, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేయించారని.. అతనిపై నిఘా ఉంచారని రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. హరీశ్‌రావు ఎన్నికను సవాలు చేసిన చక్రధర్‌గౌడ్.. ఎలక్షన్ పిటిషన్(ఈపీ) దాఖలు చేశారని, అది ఆయన హక్కు అని.. తప్పుపట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఫిర్యాదుదారు అలవాటుగా ఆరోపణలు చేసే స్వభావం ఉన్న వ్యక్తి అని హరీశ్‌రావు తరఫు న్యాయవాది పేర్కొనడాన్ని సిద్ధార్థ లూథ్రా తప్పుబట్టారు. ఎలక్షన్ పిటిషన్, ప్రస్తుత ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వేర్వేరు అంశాలని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో ఉన్నందున.. పిటిషనర్ అయిన హరీశ్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుత క్వాష్ పిటిషన్‌లో అరెస్టు నుంచి రక్షణ కల్పించరాదని.. చక్రధర్‌గౌడ్ నవంబరు 23నే హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. హరీశ్‌రావు మంత్రిగా ఉండగా ఫిర్యాదుదారు, ఆయన కుటుంబ సభ్యులు, డ్రైవర్ ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయనే ఆరోపణలు టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం తీవ్రమైనవని.. పోలీసులను దర్యాప్తు చేసుకోనివ్వాలని పేర్కొన్నారు.
చట్టబద్ధమైన వ్యవహారాల కోసం ఉపయోగించాల్సిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, నిఘా పరికరాలను కొంత మంది ప్రైవేటు వ్యక్తుల లబ్ధికోసం చట్టవిరుద్ధమైన కార్యక్రమాల కోసం వినియోగించినట్లు ఫిర్యాదులున్నాయని.. ప్రస్తుత కేసులో సైతం బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర నిఘావర్గాలు ఫిర్యాదుదారు కుటుంబంపై నిఘాపెట్టారని.. దానిపై దర్యాప్తు జరగాలని తెలిపారు. ‘‘గోప్యత అనేది ప్రాథమిక హక్కు. చక్రధర్‌గౌడ్ విషయంలో ఆ హక్కు ఉల్లంఘనకు గురైంది. ఫోన్ ట్యాపింగ్ అవుతోందని యాపిల్ కంపెనీ నుంచి ఆయనకు ఈ-మెయిల్ వచ్చింది’’ అని కోర్టుకు వివరించారు. హరీశ్‌రావు తరఫున సీనియర్ న్యాయవాది జె.రాంచంద్రరావు వాదనలను వినిపిస్తూ.. రాజకీయ దురుద్దేశంతో, ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఈ కేసు పెట్టారని ఆరోపించారు. పిటిషనర్‌పై ఎన్నికల్లో ఓడిపోయిన ఫిర్యాదుదారు అనేక ఆరోపణలు చేయడంతోపాటు ఎలక్షన్ పిటిషన్ వేశారని.. ఫోన్ ట్యాపింగ్ అయిందని హైకోర్టులో పిటిషన్ వేసి, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు. ఇరువైపులా వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. పోలీసులు యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చని.. పిటిషనర్‌ను అరెస్టు చేయరాదని పేర్కొంటూ.. విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.