Share News

మత్స్య సొసైటీల ఎన్నికల ప్రక్రియ 4 వారాల్లో ప్రారంభించండి: హైకోర్టు

ABN , Publish Date - Dec 15 , 2024 | 04:57 AM

గ్రామం నుంచి రాష్ట్రం వరకు అన్ని స్థాయిల మత్స్య సొసైటీలకు నాలుగు వారాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని సహకార సంఘాల రిజిస్ట్రార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

మత్స్య సొసైటీల ఎన్నికల ప్రక్రియ 4 వారాల్లో ప్రారంభించండి: హైకోర్టు

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గ్రామం నుంచి రాష్ట్రం వరకు అన్ని స్థాయిల మత్స్య సొసైటీలకు నాలుగు వారాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని సహకార సంఘాల రిజిస్ట్రార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మొత్తం 33 జిల్లాలకుగానూ 21 జిల్లాల్లో ఉన్న వెయ్యికి పైగా ప్రాథమిక మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్‌ల తరఫున న్యాయవాది డీఎల్‌ పాండు వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని సహకార శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తీర్మానించినా ఇంకా అమల్లోకి రాలేదని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది సమాధానం ఇస్తూ ఎన్నికల జరపాలని మత్స్యశాఖ డైరెక్టర్‌ సహకార సంఘాల రిజిస్ట్రార్‌కు లేఖ రాశారని చెప్పారు. ఈ నేపథ్యంలో నాలుగు వారాల్లో ఎన్నికల తేదీలను నోటిఫై చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

Updated Date - Dec 15 , 2024 | 04:57 AM