Heavy Rain: వర్షాలకు ఇద్దరు వృద్ధ మహిళల మృతి
ABN , Publish Date - Sep 05 , 2024 | 03:37 AM
భారీ వర్షానికి ఇంటిగోడ కూలి ఒక వృద్ధురాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో వరదనీటిలో పడి మరో వృద్ధురాలు దుర్మరణం పాలయ్యారు.
ములుగుజిల్లాలో ఇంటి గోడ కూలి ఒకరు!
యాదాద్రి భువనగిరి జిల్లాలో వరదనీటిలో పడి ప్రాణాలు కోల్పోయిన మరో వృద్ధురాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. కిన్నెరసాని వాగు దాటే క్రమంలో పశులకాపరి గల్లంతు
ములుగు, సెప్టెంబరు 4: భారీ వర్షానికి ఇంటిగోడ కూలి ఒక వృద్ధురాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో వరదనీటిలో పడి మరో వృద్ధురాలు దుర్మరణం పాలయ్యారు. ములుగు జిల్లా ములుగు మండలం భూపాల్‌నగర్ (పందికుంట)కు చెందిన సున్నం ఆగమ్మ (75) గ్రామంలోని ఓ చిన్న ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. బుధవారం తెల్లవారుజామున నిద్రలో ఆమెపై గోడ కూలి పడటంతో తీవ్ర గాయాలై మృతి చెందింది. అలాగే.. యాదాద్రిభువనగిరి జిల్లా మానాయికుంట. గ్రామానికి చెందిన బోడ ఐలమ్మ(80) మనుమళ్లతో కలిసి గ్రామంలో నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి సమయంలో కురిసిన భారీ వర్షానికి ఐలమ్మ ఇంటి చుట్టు పక్కల మోకాలి లోతు వరద నీరు చేసింది.
బుధవారం ఉదయం ఇంటి ఎదురుగా ఉన్న నిల్వ నీటిలో ఐలమ్మ మృతదేహం ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో బహిర్భూమికి బయటకు వచ్చిన ఐలమ్మ ప్రమాదవశాత్తు వరద నీటిలో పడి మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మరోవైపు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పరిధిలోని కిన్నెరసాని, మొర్రేడువాగులు పొంగిప్రవహించడంతో ఆ రెండు వాగుల సంగమ ప్రాంతంలో బుధవారం 8 మంది పశువుల కాపర్లు చిక్కుకుపోయారు. వారిలో జారె సాయి అనే పశులకాపరి రాత్రి 9 గంటల సమయంలో వరద తగ్గిందని భావించి వాగు దాటే ప్రయత్నం చేసి గల్లంతయ్యాడు.
అతడి కుటుంబసభ్యులు అధికారులకు ఆ విషయం తెలపగా.. వారు కిన్నెరసాని ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు గేట్లను నిలిపివేయాలని కోరారు. గడ్డపైనే ఉన్న మిగతావారిని అధికారులు రక్షించారు. ఇక.. వరద బురదను తొలగించుకుంటున్న వ్యక్తికి గుండెపోటు వస్తే అక్కడే ఉన్న పోలీస్ అధికారి సీపీఆర్ చేసి రక్షించారు. ఖమ్మం నగర శివారులోని దంసలాపురం కాలనీకి చెందిన శ్యామల్‌రాజు.. మున్నేరు వరదలతో బురదమయమైన తన ఇంటిని శుభ్రం చేసుకుంటుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన భార్య కేకలు వేస్తూ బయటకు వచ్చారు. అక్కడే సహాయక చర్యల్లో ఉన్న ఆర్‌ఎ్‌సఐ రమేష్.. వెంటనే వారి ఇంట్లోకి వెళ్లి అతడికి సీపీఆర్ చేశారు. దీంతో అతడు ప్రమాదంనుంచి బయటపడ్డాడు. వెంటనే రమేష్.. అంబులెన్స్‌కు సమాచారం అందించి అతణ్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.