Share News

CS Shanti Kumari: నేడు 11 జిల్లాల్లో భారీ వర్షాలు..

ABN , Publish Date - Sep 03 , 2024 | 03:34 AM

రాష్ట్రంలోని 11 జిల్లాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.

CS Shanti Kumari: నేడు 11 జిల్లాల్లో భారీ వర్షాలు..

  • అప్రమత్తంగా ఉండాలి

  • కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 11 జిల్లాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. రానున్న 24 గంటల్లో ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం-ఆసిఫాబాద్‌, మెదక్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, నిజామాబాద్‌, పెద్దపెల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిందన్నారు. ఈ 11 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సోమవారం ఆమె సచివాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా వరదల పరిస్థితి, పునరావాస, సహాయక చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ... 11 జిల్లాల కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.


పోలీసు తదితర శాఖల అధికారులు సమన్వయం చేసుకుని పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిర్మల్‌ జిల్లాకు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాన్ని పంపుతున్నామని తెలిపారు. మహారాష్ట్ర పరీవాహక ప్రాంతం నుంచి గోదావరి నదికి వచ్చే వరద నీటి విషయంలో ఆ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా సంప్రదించాలని కలెక్టర్లకు సూచించారు. డీజీపీ జితేందర్‌ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు క్రేన్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని ఎస్పీలను ఆదేశించారు.


కాగా, రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది హెడ్‌క్వార్టర్‌లోనే ఉంటూ మరింత అప్రమత్తంగా ఉండాలని దక్షిణ డిస్కమ్‌(ఎస్పీడీసీఎల్‌) సీఎండీ ముషారఫ్‌ అలీ ఫారూఖీ కోరారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై జిల్లాలు/సర్కిళ్ల చీఫ్‌ ఇంజనీర్లు, ఎస్‌ఈలతో విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో విద్యుత్‌ వ్యవస్థకు భారీ నష్టం జరిగిందని, 1,200కు పైగా విద్యుత్‌ స్తంభాలు, 4 సబ్‌ ేస్టషన్లు దెబ్బతిన్నాయన్నారు. ప్రస్తుతం సంస్థ పరిధిలో 2,417 విద్యుత్‌ స్తంభాలు, 21డీటీఆర్‌ నిర్మాణాలు, 18సబ్‌ ేస్టషన్లు దెబ్బతిన్నాయని తెలిపారు.

Updated Date - Sep 03 , 2024 | 03:34 AM