High Court,: అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యాన్ని సహించం
ABN , Publish Date - Dec 20 , 2024 | 05:44 AM
అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హైకోర్టు తేల్చిచెప్పింది. టోలిచౌకీ యూసుఫ్ టేక్డి నిజాం కాలనీలోని ఓ అక్రమ నిర్మాణానికి సంబంధించి అధికారులు సరిగా స్పందించకపోవడంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రత్యక్షంగా హాజరుకావాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది.
ఆస్తిపన్ను వసూళ్లలో శ్రద్ద ఇతర విషయాలపై లేదు
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హైకోర్టు తేల్చిచెప్పింది. టోలిచౌకీ యూసుఫ్ టేక్డి నిజాం కాలనీలోని ఓ అక్రమ నిర్మాణానికి సంబంధించి అధికారులు సరిగా స్పందించకపోవడంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రత్యక్షంగా హాజరుకావాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది. దాంతో.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ గురువారం ప్రత్యక్షంగా జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ఆస్తిపన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ ఇతర విధులపై ఉండడం లేదు. రోజురోజుకూ జీహెచ్‌ఎంసీపై ప్రజ లు నమ్మకం కోల్పోతున్నారు. వేలల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే.. కోర్టులకు వెళ్లినప్పుడు ‘చూద్దాం లే’ అన్నట్లు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఫిర్యాదు చేసినా.. స్పందించడం లేదు’’ అంటూ ధర్మాసనం ఆక్షేపించింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే పట్టించుకోని అధికారుల ను బాధ్యులను చేస్తూ.. వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సూచించింది.
దిగువ కోర్టుల్లో జీహెచ్‌ఎంసీ తరఫున న్యాయవాదులు సరిగా ప్రాతినిధ్యం వహించకపోవడం వల్లే ఎక్స్‌పార్టీ ఆర్డర్లు జారీ అవుతున్నాయని పేర్కొంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల నుంచి దిగువ కోర్టులకు మార్గదర్శకాలున్నాయని, దాంతో అంత తేలిగ్గా అక్రమ నిర్మాణదారులకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. 15 రోజులకోసారి క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించి, అక్రమ నిర్మాణలపై సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించింది. నిర్లక్ష్యాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని.. అలా జరిగితే తప్ప.. అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేమని అభిప్రాయపడింది. ‘‘అక్రమ నిర్మాణాలపై నామమాత్ర చర్యలు తీసుకుంటున్నారు. నిర్మాణాలకు రెండు రంధ్రాలు పెట్టి, వెళ్లిపోతున్నారు. దీన్ని కూల్చివేత అంటారా?’’ అని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలపై తీసుకుంటున్న చర్యలపై వచ్చేనెల 22 నాటికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కమిషనర్‌కు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.