High Court: చట్టం ప్రకారమే ఎలివేటెడ్ కారిడార్‌కు భూసేకరణ
ABN , Publish Date - Jul 30 , 2024 | 04:42 AM
రాజీవ్‌రహదారి ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ విషయంలో చట్టప్రకారం వ్యవహరించాలని హెచ్‌ఎండీఏకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
సికింద్రాబాద్ క్లబ్‌కు ముందస్తు నోటీసు ఇవ్వండి
హెచ్‌ఎండీఏకు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌రహదారి ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ విషయంలో చట్టప్రకారం వ్యవహరించాలని హెచ్‌ఎండీఏకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు నిర్మించతలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ విషయంలో తమకు నోటీసు, సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టేందుకు హెచ్‌ఎండీఏకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని పేర్కొంటూ సికింద్రాబాద్ క్లబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సునీల్ బీ గాను వాదనలు వినిపిస్తూ.. కంటోన్మెంట్ పికెట్ వద్ద తోకట్ట గ్రామపరిధిలోని 22 ఎకరాల్లో ఉన్న సికింద్రాబాద్ క్లబ్‌కు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా టన్నెల్స్, నిర్మాణాల పనులు చేపట్టడం చెల్లదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. కారిడార్ కారణంగా సికింద్రాబాద్ క్లబ్‌కు చెందిన బంగ్లాలు, ఆస్తులకు నష్టం కలిగించే పక్షంలో పిటిషనర్‌కు ముందస్తు నోటీసులు ఇవ్వాలని పేర్కొంది.