Share News

High Court : ప్రైవేటు పాఠశాలల్లో.. పేద పిల్లలకు ఎన్ని ఉచిత సీట్లు ఇచ్చారు?

ABN , Publish Date - Jul 17 , 2024 | 05:39 AM

విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 12(1)(సీ)లో పేర్కొన్న విధంగా ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు ఎన్ని ఇచ్చారు..? చట్టం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

High Court : ప్రైవేటు పాఠశాలల్లో.. పేద పిల్లలకు ఎన్ని ఉచిత సీట్లు ఇచ్చారు?

  • విద్యా హక్కు చట్టం అమలుపై వివరణ ఇవ్వండి

  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 12(1)(సీ)లో పేర్కొన్న విధంగా ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు ఎన్ని ఇచ్చారు..? చట్టం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 2009లో ఈ చట్టం అమలులోకి వచ్చినా ఇప్పటికీ 25 శాతం ఉచిత సీట్లను ఇవ్వడం లేదని 2020లోనే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మంగళవారం ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌ కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో ఈ చట్టం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మార్గదర్శకాలు లేవని పేర్కొన్నారు. దీంతో విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 2 (ఎన్‌)లో పేర్కొన్న ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఎన్ని ఉచిత సీట్లు ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. సెక్షన్‌ 12(1)(సీ) అమలుపై రెండు వారాల్లో నివేదిక సమర్పించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Updated Date - Jul 17 , 2024 | 05:39 AM