Share News

Fake Pesticides: నకిలీ పురుగు మందుల కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారు?

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:42 AM

నకిలీ పురుగుమందులను అరికట్టకపోతే ప్రజారోగ్యానికి, పంట భూములకు తీవ్ర నష్టం జరుగుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నకిలీ పురుగుమందులను కట్టడి చేసేందుకు ఏయే చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ, ఆరోగ్య భద్రతా విభాగం, రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది.

Fake Pesticides: నకిలీ పురుగు మందుల కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారు?

  • కేంద్రంతో పాటు రాష్ట్ర సర్కారుకు హైకోర్టు నోటీసులు..

  • మానసిక ఆరోగ్య కేంద్రాలపైనా వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): నకిలీ పురుగుమందులను అరికట్టకపోతే ప్రజారోగ్యానికి, పంట భూములకు తీవ్ర నష్టం జరుగుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నకిలీ పురుగుమందులను కట్టడి చేసేందుకు ఏయే చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ, ఆరోగ్య భద్రతా విభాగం, రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది. సరైన వ్యవస్థ లేకపోవడంతో మార్కెట్‌ను నకిలీ పురుగుమందులు ముంచెత్తుతున్నాయని.. దీంతో రైతులు, ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పంట నష్టం, భూములు నిస్సారంగా మారడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ బీరంగూడకు చెందిన వట్టెం రవికృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


‘నిబంధనల మేరకు పురుగుమందుల్లో నకిలీలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలి. నకిలీ పురుగుమందులపై రైతులు, ప్రజలకు అవగాహన కలిగేలా ప్రకటనలు జారీ చేయాలి. నాణ్యమైన, గుర్తింపు పొందిన పురుగుమందులు మాత్రమే రైతులకు చేరేలా క్యూఆర్‌ కోడ్‌లు కేటాయించడం.. సంయుక్త టాస్క్‌ఫోర్స్‌ లేదా కమిటీలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టేలా ఆదేశించాలి’ అని పిటిషనర్‌ కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వివరణ కోరుతూ విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.


  • మానసిక ఆరోగ్య కేంద్రాలపైనా..

మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం-2017 మేరకు తెలంగాణలో రాష్ట్ర అథారిటీ, జిల్లా కమిటీల ఏర్పాటుతో పాటు మానసిక ఆరోగ్య చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ రాసిన లేఖను సుమోటోగా తీసుకొని హైకోర్టు విచారించింది. మానసిక ఆరోగ్య కేంద్రాలు, సౌకర్యాలపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - Jul 27 , 2024 | 04:42 AM