Share News

Highway Accident: జాతీయ రహదారిపై 8 గంటల ట్రా‘ఫికర్‌’

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:42 AM

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు ఎనిమిది గంటల పాటు ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. ఎస్సై కృష్ణ మధు తెలిపిన వివరాల ప్రకారం.. బడ్‌వైజర్‌ బీర్ల లోడుతో ఓ లారీ సంగారెడ్డి జిల్లా నుంచి ఖమ్మం వెళ్తోంది.

Highway Accident: జాతీయ రహదారిపై 8 గంటల ట్రా‘ఫికర్‌’

  • ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌ దుర్మరణం

  • మృతదేహం రెండు లారీల మధ్య ఇరుక్కోవడంతో వెలికితీతకు సమయం

  • చౌటుప్పల్‌ పరిధిలో ఘటన

చౌటుప్పల్‌ రూరల్‌, జూలై 31: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు ఎనిమిది గంటల పాటు ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. ఎస్సై కృష్ణ మధు తెలిపిన వివరాల ప్రకారం.. బడ్‌వైజర్‌ బీర్ల లోడుతో ఓ లారీ సంగారెడ్డి జిల్లా నుంచి ఖమ్మం వెళ్తోంది. అలాగే ఉల్లిగడ్డల లోడుతో మరో లారీ మహరాష్ట్రలోని పుణె నుంచి విజయవాడ వైపు వెళ్తోంది. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం లక్కారం గ్రామంలోని తంగేడువనం వద్ద.. ఉల్లి లోడుతో వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న బీర్ల లారీని అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ఘ టనలో ఆ లారీ డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు.


మృతుడు మహారాష్ట్రలోని నాందుగామ్‌ గ్రామానికి చెందిన దర్విపు అజయ్‌ఆశోక్‌ (22)గా గుర్తించారు. అయితే.. అతి వేగంగా ఢీకోట్టడంతో ఉల్లి లారీ ముందుభాగం నుజ్జునుజ్జవడంతో పాటు ముందు లారీలోకి చొచ్చుకుపోయింది. డ్రైవర్‌ అశోక్‌ మృతదేహం రెండు లారీల మధ్యన ఇరుక్కుపోయింది. దీంతో ఇటు లారీలను, మధ్యలో ఇరుక్కున్న మృతదేహాన్ని వేరుచేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. నాలుగు గంటల పాటు శ్రమించి క్రేన్‌ సహాయంతో లారీలను వేరు చేశారు. ఈ క్రమంలో మృతదేహం చితికిపోయింది. శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. మరోవైపు, ఉదయం నాలుగు గంటలకు రోడ్డు ప్రమాదం జరుగగా.. మధ్నాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్‌ అంతరాయం కొనసాగింది.


హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే మార్గం కొయ్యలగూడెం వరకు ఐదు కిలోమీటర్ల మేర, విజయవాడ నుంచి హైదరాబాద్‌ మార్గంలో చౌటుప్పల్‌ వరకు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫి క్‌ నిలిచిపోయింది. దారిపొడవునా వా హనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. విజయవాడ నుంచి వచ్చే వాహనాలను సర్వీసు రోడ్డు మీదు గా మళ్లించారు. కాగా, ఉల్లి లారీ డ్రైవర్‌ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కృష్ణ మధు తెలిపారు.

Updated Date - Aug 01 , 2024 | 04:42 AM