Share News

Hospital Staffing Crisis: ఆస్పత్రుల్లో డాక్టర్లు ఏరీ?

ABN , Publish Date - Aug 05 , 2024 | 03:10 AM

అసలే వ్యాధులు ప్రబలే సీజన్‌. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్‌ ఫీవర్ల వంటివి విజృంభిస్తున్న సమయం. పెద్దాస్పత్రులు వందల సంఖ్యలో రోగులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి. వైద్యులు, వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాల్సిన సమయం.

Hospital Staffing Crisis: ఆస్పత్రుల్లో డాక్టర్లు ఏరీ?

  • పెద్దాస్పత్రుల్లో బదిలీ అయిన స్థానాల్లో నియామకాలు కరువు

  • ‘లాంగ్‌స్టాండింగ్‌’ పేరిట నిపుణులకూ బదిలీలు

  • వారి స్థానాల్లో కొత్తవారిని నియమించని ప్రభుత్వం

  • వ్యాధుల సీజన్‌ కావడంతో జ్వరాల బారిన ప్రజలు

  • ఆస్పత్రులకు బారులు తీరుతున్న రోగులు

  • వైద్యులు, సిబ్బంది లేమితో అందని వైద్యసేవలు

  • పలు విభాగాల్లో వాయిదా పడుతున్న శస్త్రచికిత్సలు

  • జూనియర్లు, పీజీ విద్యార్థులతో నెట్టుకొస్తున్న వైనం

  • ఉస్మానియాలో అన్ని విభాగాల్లో ఖాళీలే..

(హైదరాబాద్‌ సిటీ/న్యూ్‌సనెట్‌ వర్క్‌, ఆంధ్రజ్యోతి): అసలే వ్యాధులు ప్రబలే సీజన్‌. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్‌ ఫీవర్ల వంటివి విజృంభిస్తున్న సమయం. పెద్దాస్పత్రులు వందల సంఖ్యలో రోగులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి. వైద్యులు, వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాల్సిన సమయం. ఇలాంటి కీలక పరిస్థితుల్లో పెద్దాస్పత్రుల్లో బదిలీలు చేపట్టిన ప్రభుత్వం.. ఖాళీ అయిన స్థానాల్లో నియామకాలు మాత్రం జరపలేదు. బదిలీలు జరిగిన స్థానాల్లో సగం మందిని కూడా నియమించలేదు. దీంతో ఆస్పత్రులకు పెద్దసంఖ్యలో వస్తున్న రోగులు తగిన వైద్యసేవలందక అవస్థలు పడుతున్నారు.


దీనికితోడు సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్నారనే కారణంతో అనుభవం ఉన్న, నిపుణులైన వైద్యులకు ప్రభుత్వం స్థానచలనం కల్పించడంతో కీలక వైద్యసేవలు, శస్త్రచికిత్సల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పీజీ వైద్యులతోనే కాలం నెట్టురావాల్సివస్తోంది. ఎవరికైనా ఏ పెద్ద రోగం వచ్చినా.. వెంటనే గుర్తుకు వచ్చేది ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులే. పిల్లలకు సుస్తీ చేస్తే నిలోఫర్‌ ఆస్పత్రి. ఆ ఆస్పత్రులకు రాష్ట్రం నలువైపుల నుంచి ఎందరో రోగులు వస్తుంటారు. రెండు రాష్ట్రాల్లోనూ అతిపెద్ద ఆస్పత్రులు హైదరాబాద్‌లోనే ఉండడంతో అవి ఎప్పుడు చూసినా రోగులతో కిక్కిరిసిపోతుంటాయి. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 40 నుంచి 100 వరకు మైనర్‌, మేజర్‌ సర్జరీలు జరుగుతుండగా, 20 నుంచి 40 వరకు ప్రసవాలు చేస్తుంటారు.


ప్రతి రోజూ 2వేల నుంచి 3 వేల వరకు ఓపీ నమోదవుతుంది. రోజుకు 200 మందికిపైగా అడ్మిషన్లు ఉంటాయి. అయితే ఈ ఆస్పత్రుల్లో దీర్ఘకాలికంగా ఉంటున్న వైద్యులను ప్రభుత్వం ఒక్కసారిగా భారీ ఎత్తున బదిలీ చేసింది. ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రి, గాంధీ మెడికల్‌ కాలేజీ, నిలోఫర్‌, ఎంఎన్‌జే ఆస్పత్రుల విభాగాల వైద్యులను ఇతర చోట్లకు బదిలీ చేశారు. మొత్తంగా.. హైదరాబాద్‌ నుంచి 135 మంది వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, విబాగాల అధిపతులు, సూపరింటెండెంట్లను బదిలీ చేశారు. కానీ, ఇక్కడి నుంచి వెళ్లేవారే తప్ప. వచ్చేవారు ఉండడం లేదు. దీంతో ఆ ప్రభావం వైద్య సేవలపై పడుతోంది. శస్త్రచికిత్సలు వాయిదా పడుతున్నాయి. అత్యవసరమైనవి తప్ప ఇతర సర్జరీలు చేయడం లేదు.


  • అంతా ఇన్‌చార్జి సూపరింటెండెంట్లే...!

ఉస్మానియా ఆస్పత్రి, ఫీవర్‌, నిలోఫర్‌, చెస్ట్‌, మానసిక ఆస్పత్రి తదితర ఆస్పత్రుల సూపరింటెండెంట్లను బదిలీ చేసిన ప్రభుత్వం.. అక్కడ పూర్తికాలం పనిచేసే వైద్యాధికారులను నియమించలేదు. అదే ఆస్పత్రుల్లో పనిచేసే సీనియర్‌ వైద్యులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఉస్మానియా, నిలోఫర్‌, నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి, ఛాతీ వ్యాదుల వైద్యశాల, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్లను బదిలీ చేసి.. ఆయా ఆస్పత్రుల్లో సీనియర్‌ వైద్యులుగా ఉన్నవారికి ఇన్‌చార్జి సూపరింటెండెంట్లుగా బాధ్యతలు అప్పగించారు.


ఒక్క గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు స్థానంలో మాత్రమే కొత్తగా డాక్టర్‌ రాజకుమారిని పూర్తి స్థాయు సూపరింటెండెంట్‌గా నియమించారు. ఇతర ఆస్పత్రులకు ఇన్‌చార్జులతోనే సరిపెట్టడంతో.. పర్యవేక్షణ, అజామాయిషీ చేసే పూర్తి స్థాయి వైద్యాధికాధిరి లేక అటు పాలన, ఇటు చికిత్సలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సూపరింటెండెంట్లు మాత్రమే కాకుండా.. ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లనూ బదిలీ చేశారు. ఇందులో భాగంగా.. ఉస్మానియా ఆస్పత్రి జనరల్‌ సర్జరీ విభాగం నుంచి నలుగురు ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు బదిలీపై వెళ్లిపోయారు. శస్త్ర చికిత్సల సమయంలో అనస్తీషియా ఇచ్చే నలుగురు సీనియర్‌ ప్రొఫెసర్లనూ బదిలీ చేయడంతో సర్జరీలకు ఇబ్బందులు తలెత్తాయి.


  • అన్ని విభాగాల్లోనూ ఖాళీలే..!

ఉస్మానియా ఆస్పత్రిలో మొత్తం 41 వార్డులు ఉండగా.. 65 మంది ఇన్‌చార్జి నర్సులు షిఫ్టుల వారీగా వార్డుల్లోని రోగులకు సేవలందించేవారు. ఏకకాలంలో 41 మంది ఇన్‌చార్జి నర్సులను, 115 మంది స్టాఫ్‌ నర్సులను బదిలీ చేశారు. కానీ, వారి స్థానంలో తిరిగి ఎవరూ రాకపోవడంతో వార్డుల్లో రోగులను పట్టించుకునేవారు కరువయ్యారు. నర్సింగ్‌ విద్యార్థులతో పనులు చేయిస్తున్నప్పటికీ రోగులకు సకాలంలో మందులు, వైద్య సేవలు అందడం లేదని పలువురు రోగుల సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో జనరల్‌ సర్జరీలో 6 పోస్టులు ఉండగా, మొత్తం ఆరుగురూ ఇటీవల బదిలీ అయ్యారు. జనరల్‌ మెడిసిన్‌లో కూడా 6 పోస్టులు ఉండగా, అందరు బదిలీ అయ్యారు. గైనకాలజీ విభాగంలో ఐదుగురికిగాను నలుగురు వైద్యులు, ఆర్థోపెడిక్‌ విభాగంలో ముగ్గురికిగాను ఇదరు, అనస్తీషియా విభాగంలో నలుగురిలో ముగ్గురు, అనస్తీషియా అసోసియేట్‌ ప్రొఫెసర్లు 8మందిలో ఆరుగురు బదిలీ అయ్యారు.


రేడియాలజీలో ఇద్దరికి ఇద్దరు, డెంటల్‌ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లకు ఒకరు బదిలీ అయ్యారు. నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రి అయితే బదిలీలతో ఖాళీ అయిపోయింది ఈ ఆస్పత్రిలో ఏకంగా వివిధ కేటగిరీలకు చెందిన 56 మంది బదిలీ అయ్యారు. కాగా, నిలోఫర్‌లో 11 మంది ఫ్రొఫెసర్లు, ఐదుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లతోపాటు 40 మంది హెడ్‌ నర్సులు, స్టాఫ్‌ నర్సులు ఆస్పత్రి ఆర్‌ఎంవోను కూడా బదిలీ చేశారు. వెయ్యి పడకల నిలోఫర్‌ ఆసుపత్రిలో ఒకేసారి ఇంత మందిని బదిలీ చేయడంతో చికిత్సలు అందించడం సవాల్‌గా మారింది. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో 10 మంది ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్లు, ఇద్దరు అసిస్టెంట్లు, నలుగురు హెడ్‌నర్సులు, 8 మంది స్టాఫ్‌ నర్సులు బదిలీపై వెళ్లారు. వీరి స్థానంలో కొత్త వారు రావాల్సి ఉంది.


చెస్ట్‌ ఆస్పత్రిలో నలుగురు ప్రొఫెసర్లను బదిలీ చేయగా ఇద్దరిని మాత్రమే నియమించారు. ఆరుగురు ప్రొఫెసర్లు బదిలీ కాగా ఒక్కరినే నియమించారు. 24 మంది స్టాఫ్‌ నర్సులను బదిలీ చేయగా.. వారి స్థానంలో ఇప్పటికి కేవలం ఇద్దరే చేరారు. ఇక ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో నలుగురు ప్రొఫెసర్లను బదిలీ చేసి ఇద్దరిని మాత్రమే నియమించారు. ఎనిమిది మంది హెడ్‌నర్సులను బదిలీ చేసి నలుగురిని నియమించారు. స్టాఫ్‌నర్సులను ముగ్గురు బదిలీ చేసి.. ఒక్కరిని కూడా నియమించలేదు. బదిలీ చేసిన ఏడీఈ స్థానంలోనూ ఎవరినీ నియమించలేదు. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 12 మంది ప్రొఫెసర్లను, మరో ఎనిమిది మంది సిబ్బందిని బదిలీ చేశారు.


  • వారంలో పూర్తి స్థాయి వైద్యులు

గాంధీ ఆస్పత్రిలో కొత్త వైద్యులు ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపడుతున్నారు. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో వైద్యులు చేరతారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులకు ఇబ్బంది లేకుండా వైద్యం అందిస్తున్నాం. శస్త్ర చికిత్సలు ఎక్కడా ఆపడంలేదు. సకాలంలోనే శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి.

- గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజకుమారి


  • శస్త్ర చికిత్సలకు అంతరాయం

పెద్దాస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది లేకపోవంతో సర్జరీలు చేయడంలో ఆలస్యం జరుగుతోంది. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల భర్తీ పూర్తి స్థాయిలో జరగకపోవడంతో శస్త్ర చికిత్సలను వాయిదా వేస్తున్నారు. దీంతో క్యూక్యూడీసీ భవనంలో జనరల్‌ సర్జరీ వార్డులో రోగుల రద్దీ పెరిగిపోయి జనరల్‌ మెడిసిన్‌ విభాగం వార్డులను కూడా వినియోగించుకుంటున్నారు. ఆ యూనిట్లలో జరగాల్సిన సర్జరీలు వాయిదా పడుతున్నాయి. మరో నాలుగు యూనిట్లలో ఉన్న వైద్యులు శస్త్ర చికిత్సలను చేసేందుకు ప్రయత్నించినా నర్సింగ్‌ సిబ్బంది లేరు. దీంతోపాటు అత్యంత ముఖ్యమైన విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను ప్రభుత్వం బదిలీపై పంపింది. గాంధీలోనూ ప్రస్తుతం అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, పీజీ వైద్యులు మాత్రమే వైద్యం చేస్తున్నారు.


ఆర్థోపెడిక్‌, కార్డియో థెరపీ, యూరాలాజీ, అనస్తీషియా ఇతర విభాగాలు ఖాళీగా ఉండడంతో శస్త్ర చికిత్సలు చేయలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. గాంధీ ఆస్పత్రిలో ప్రతి సోమ, మంగళవారాల్లో 2వేల మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకుంటారు. మిగతా రోజుల్లో 1500 మంది ఓపీకి వస్తుంటారు. అయితే ఓపీ విభాగంతోపాటు పలు విభాగాల్లో పీజీ, జూనియర్‌ వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నారు. క్యాజువాలిటీ విభాగానికి వచ్చే రోగులు వైద్యం కోసం దాదాపు ఆరు గంటల పాటు వేచి ఉండాల్సివస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి వచ్చే బాధితులకు.. నర్సులు ఒక ఇంజక్షన్‌ ఇచ్చి సమయం పడుతుందని చెప్పి వెళుతున్నారు. అర్ధరాత్రి సమయంలో అత్యవసర పరిస్ధితిలో క్యాజువాలిటీ వార్డుకు వచ్చే రోగులకు స్కానింగ్‌, ఎక్స్‌రే తీయాలంటే దాదాపు రెండు గంటల సమయం పడుతోంది.

Updated Date - Aug 05 , 2024 | 03:10 AM