HYD : ప్రముఖ పర్యావరణవేత్త అల్లాణి ఇకలేరు
ABN , Publish Date - Sep 02 , 2024 | 05:01 AM
కాలుష్యానికి కేరాఫ్ అడ్ర్‌సగా నిలిచే పటాన్చెరులో తొలిసారిగా పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ అల్లాణి కిషన్‌రావు(86) కన్ను మూశారు.
పటాన్చెరు, సెప్టెంబరు 1: కాలుష్యానికి కేరాఫ్ అడ్ర్‌సగా నిలిచే పటాన్చెరులో తొలిసారిగా పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ అల్లాణి కిషన్‌రావు(86) కన్ను మూశారు. కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం సాయంత్రం ఇంటివద్దే మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామలో జన్మించిన కిషన్‌రావు ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పటాన్‌చెరులోనే వైద్య వృత్తిని కొనసాగించారు. పటాన్చెరు, బొల్లారం తదితర ప్రాంతాల్లో 1980 ప్రాంతంలో రసాయన పరిశ్రమల కాలుష్యంపై ఆయన అలుపెరగని పోరాటం చేశారు. పటాన్చెరు, జిన్నారం మండలాల పరిధిలోని అనేక గ్రామాల్లో భూగర్భ జలవనరులు కలుషితమవడంపై ఆధారాలతో సహా సుప్రీంకోర్టుకు తెలిపారు.
ఆసానికుంట చెరువు కాలుష్య వ్యవహారం ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టులో ఆయన వేసిన పిల్ అప్పటి ప్రభుత్వాల్లో ప్రకంపనలు సృష్టించింది. నాటి జడ్జి జస్టిస్ జీవన్‌రెడ్డి పటాన్చెరు ప్రాంతంలో కాలుష్యంతో దెబ్బతిన్న చెరువులు, గ్రామాలను పరిశీలించి చలించిపోయారు. పటాన్చెరు ప్రాంతాన్ని మరో చర్నోబిల్గా అభివర్ణించారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమల యాజమాన్యాలు పటాన్చెరులో వంద పడకల ఆస్పత్రిని నిర్మించాలని నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది. 1990 ప్రాంతంలో రుద్రారంలోని పశుమాంస ఎగుమతి పరిశ్రమ అల్‌కబీర్ లిమిటెడ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున నిర్వహించిన ఆందోళనలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 1992 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్‌సభకు బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. పటాన్చెరు కాలుష్యంపై ఆయన రచించిన ‘ఏ హెల్ ఆన్ ది ఎర్త్’ పుస్తకం సంచలనం సృష్టించింది.