Hyderabad: ప్రచారం హోరెత్తేలా.. ప్రణాళికలు రచిస్తున్న అభ్యర్థులు
ABN , Publish Date - Apr 25 , 2024 | 10:38 AM
పార్లమెంట్ పరిధిలోని ప్రజలను పూర్తిస్థాయిలో కలిసేలా అభ్యర్థులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంటింటి ప్రచారం ఏ ప్రాంతాల్లో చేయాలి, వాకర్లు, కాలనీ, బస్తీ సంఘాలతో సమావేశాలు ఎప్పుడు నిర్వహంచాలి, అగ్రనేతలతో రోడ్ షోలు, క్షేత్రస్థాయి ప్రచారం ఎక్కడ చేయాలి అన్న దానిపై ముఖ్యనేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు.
- క్షేత్రస్థాయిలో పర్యటన.. అగ్రనేతలతో రోడ్ షోలు
- నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు
- ఆసక్తికరంగా సికింద్రాబాద్ రాజకీయం
- మల్కాజిగిరి.. పూర్తి భిన్నం
నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ప్రచారాన్ని మరింత హోరెత్తించేలా అభ్యర్థులు ప్రణాళికలు రచిస్తున్నారు. అగ్రనేతలను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో తిరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ సిటీ: పార్లమెంట్ పరిధిలోని ప్రజలను పూర్తిస్థాయిలో కలిసేలా అభ్యర్థులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంటింటి ప్రచారం ఏ ప్రాంతాల్లో చేయాలి, వాకర్లు, కాలనీ, బస్తీ సంఘాలతో సమావేశాలు ఎప్పుడు నిర్వహంచాలి, అగ్రనేతలతో రోడ్ షోలు, క్షేత్రస్థాయి ప్రచారం ఎక్కడ చేయాలి అన్న దానిపై ముఖ్యనేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం, సాయంత్రం(Morning and evening) క్షేత్రస్థాయి ప్రచారం, రోడ్‌షోలు, మధ్యాహ్నం సమావేశాలు నిర్వహించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్(Secunderabad Parliament) స్థానం నుంచి మొదటిసారి బరిలో నిలిచిన ఓ అభ్యర్థి శాసనసభ నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలతోపాటు, తన ప్రధాన అనుచరుల సలహాలు తీసుకొని ప్రచార షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు.
ఇదికూడా చదవండి: Khammam: నామ నాగేశ్వరరావు ఆస్తులు రూ.155 కోట్లు
ఆ ముగ్గురూ..
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులదీ ప్రత్యేక నేపథ్యం. కిషన్‌రెడ్డి గతంలో అంబర్‌పేట శాసనసభ్యుడిగా మూడు పర్యాయాలు పని చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా, సికింద్రాబాద్ శాసనసభ్యుడు పద్మారావు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పార్లమెంట్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురికీ ఆయా అసెంబ్లీ స్థానాల పరిధిలో ప్రత్యేక స్థానం ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కిషన్‌రెడ్డి.. 2019 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 62 వేల మెజార్టీతో గెలిచిన కిషన్‌రెడ్డికి(Kishan Reddy) అంబర్‌పేట నుంచి 48 వేల వరకు మెజార్టీ లభించింది. స్థానిక శాసనసభ్యుడిగా పని చేయడం.. శాసనసభ ఎన్నికల్లో పరాజయంతో ఆయన పట్ల అక్కడి ప్రజల్లో సానుభూతి కనిపించింది. ఈసారి ఆ స్థాయిలో అంబర్‌పేట నుంచి మెజార్టీ వస్తుందా..? లేదా అన్నది ఫలితాల వెల్లడి అనంతరం స్పష్టమవుతుంది. పద్మారావు, దానం నాగేందర్ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు అనే సెంటిమెంట్ పని చేస్తుందా..? తమ నియోజకవర్గాల్లో మెజార్టీ ఓట్లు దక్కించుకుంటారా.. అన్నది చర్చనీయాంశంగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం 22వేల పైచిలుకు ఓట్ల మెజా ర్టీతో, పద్మారావు సుమారు 46వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సొంత అసెంబ్లీ స్థానాల్లో వారికి ఎంత ఆధిక్యత లభిస్తుందన్నది గెలుపు, ఓటములపై ప్రభావం చూపే అవకాశముంది.
ఇదికూడా చదవండి: పంద్రాగస్టులోపు హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా
మల్కాజిగిరి.. పూర్తి భిన్నం...
మల్కాజిగిరిలో పరిణామాలు భిన్నంగా ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పలుమార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. బీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిచిన రాగిడి లక్ష్మారెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం. హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఈటలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. చైర్‌పర్సన్‌గా పని చేసిన సునీతారెడ్డి, మంత్రిగా వ్యవహరించిన మహేందర్‌రెడ్డికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పరిచయాలున్నాయి. కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో కేడర్ ఉండడం తమకు బలమని వారు భావిస్తున్నారు. రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో ఆయనకు అక్కడ ఏ మేరకు మద్దతు లభిస్తుందన్నది చూడాలి.
ఇంటింటి ప్రచారం..
ఇప్పటి వరకు పార్టీ శ్రేణులు, కాలనీ, బస్తీ, యువజన సంఘాలతో సమావేశాల నిర్వహణపై దృష్టి సారించిన అభ్యర్థులు.. ఇక ఇంటింటి ప్రచారం మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీల అగ్రనేతలూ ప్రచారానికి హాజరయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం దానం నాగేందర్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) హాజరయ్యారు. నగరంలో సీఎం, మంత్రుల ప్రచారం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు, ఇతర రాష్ర్టాల సీఎంలు ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మరో నేత హరీ్‌షరావు గ్రేటర్‌లోని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారని బీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రచారం ప్రారంభించని నేపథ్యంలో స్థానికంగా వారు పర్యటించేలా ఆదేశాలు జారీ చేయాలని అగ్రనేతలను అభ్యర్థులు కోరుతున్నారు.
ఇదికూడా చదవండి: Lok Sabha Polls: రాజాసింగ్ డుమ్మా వెనుక ఉన్న మతలబు ఏమిటో..?
Read Latest National News and Telugu News