Hyderabad: గ్రేటర్‌లో కాంగ్రెస్ బోణీ.. కంటోన్మెంట్‌లో పాగా వేసిన హస్తం పార్టీ
ABN , Publish Date - Jun 05 , 2024 | 10:18 AM
గ్రేటర్‌లో ఎట్టకేలకు కాంగ్రెస్ బోణీ కొట్టింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment) సీటును హస్తం పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థిపై ఎన్.శ్రీగణేష్ ఘన విజయం సాధించారు.
- బీజేపీ అభ్యర్థిపై శ్రీగణేష్ ఘన విజయం
సికింద్రాబాద్: గ్రేటర్‌లో ఎట్టకేలకు కాంగ్రెస్ బోణీ కొట్టింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment) సీటును హస్తం పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థిపై ఎన్.శ్రీగణేష్ ఘన విజయం సాధించారు. బీఆర్‌ఎస్(BRS) తరఫున పోటీ చేసిన దివంగత శాసనసభ్యుడు జి.సాయన్న కుమార్తె, దివంగత శాసనసభ్యురాలు లాస్య నందిత అక్క నివేదిత మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఇదికూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో వార్ వన్‌సైడ్..
పని చేయని సానుభూతి
ఒకే ఏడాదిలో ఒకే ఇంట్లో ఇద్దరు.. అదీ శాసనసభ్యులుగా పదవిలో ఉండగా మరణించారు. వారి వారసురాలిగా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆడబిడ్డను గెలిపించాలంటూ కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి నివేదిత విషయంలో ఆ పార్టీ ప్రయోగించిన సానుభూతి మంత్రం పని చేయలేదు. తన నాన్న సాయన్న, చెల్లి లాస్య నందితలను ప్రజలకు పదే పదే గుర్తు చేస్తూ, కన్నీళ్లు కార్చినప్పటికీ నివేదిత ఈ ఎన్నికల్లో గెలవలేకపోయారు.
దివంగత శాసనసభ్యుడు జి.సాయన్న మరణించడంతో ఆయన స్థానంలో బీఆర్‌ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందితకు టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో 17వేల పైచిలుకు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఎన్.శ్రీగణేష్‌పై లాస్య నందిత విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో లాస్య నందితకు నివేదిత అన్నీ తానై వ్యవహరించారు. నందిత మరణానంతరం నివేదిత ఉప ఎన్నికలో నిలబడ్డారు. సానుభూతితో గెలుస్తారని చాలామంది భావించినా ఆమె మూడో స్థానానికే పరిమితం అయ్యారు.
ఇదికూడా చదవండి: TG: ఇది ప్రజల విజయం: రఘురాంరెడ్డి
12 మంది స్వతంత్య్ర అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, వారందరితో పోలిస్తే నోటాకు అత్యధిక ఓట్లు పడ్డాయి. నోటాకు 950 ఓట్లు పోలయ్యాయి. ఉప్పలేటి రాజేందర్‌కు 223, గుండటి నర్సింగ్‌రావుకు 114, యాదీశ్వర్ నక్కాకు 80, ఇల్లెందుల శంకర్‌కు 73, డి.కృష్ణవేణికి 104, ఎం.జైరామ్‌కు 43, జీడిమెట్ల రాజ్‌కుమార్‌కు 44, దూడ మహిపాల్‌కు 110, దండెం రత్నంకు 131, బండారు నాగరాజుకు 658, ఎం.రాజహంసకు 106, ఎం.సంజీవులుకు 78 ఓట్లు పోలయ్యాయి. సికింద్రాబాద్ వెస్లీ కళాశాలలో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ఓట్లతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరిగింది.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News