Share News

Hyderabad : ‘కమాండ్‌ కంట్రోల్‌’కు డీజీపీ కార్యాలయం!

ABN , Publish Date - Jul 22 , 2024 | 02:27 AM

లక్డీకాపూల్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐ3సీ)కు తరలించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Hyderabad : ‘కమాండ్‌ కంట్రోల్‌’కు డీజీపీ కార్యాలయం!

  • అధికారుల కార్యాలయాలూ తరలింపు

  • ఇక్కడి నుంచే విభాగాల కార్యకలాపాలు

  • రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. త్వరలో మార్పు

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): లక్డీకాపూల్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐ3సీ)కు తరలించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డీజీపీతోపాటు ఇతర కీలక అధికారుల కార్యాలయాలూ అక్కడికి మారనున్నాయి. ఐ3సీ నిర్మాణ సమయంలోనే డీజీపీతోసహా అన్ని పోలీసు విభాగాలు, ఇతర కీలక ప్రభుత్వ విభాగాలు ఇక్కడి నుంచి పని చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అక్కడ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌తోపాటు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో కొనసాగుతున్నాయి.

డీజీపీ కార్యాలయం అక్కడికి మార్చడం వల్ల అన్ని కీలక విభాగాలు ఒకేచోట నుంచి పనిచేసే అవకాశం ఉంటుంది. కాగా, మొన్నటి వరకు ఏపీ సీఐడీ ఆధీనంలో ఉన్న లక్డీకాపూల్‌లోని భవనం తెలంగాణ ఆధీనంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఐ3సీలో కొనసాగుతున్న సీపీ కార్యాలయంలో కొంత భాగం అక్కడికి మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూం భవనం పక్కనే మొన్నటి వరకు కొనసాగిన సీసీఎస్‌ కార్యాలయం బషీర్‌బాగ్‌లోని పాత సీపీ కార్యాలయానికి మార్చారు.


అయితే ఇక్కడ అధికారులు, సిబ్బంది కూర్చుని రోజువారి విధులు నిర్వహించేందుకు అనుకూలంగా గదులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని పాత బిల్డింగ్‌కు లేదా మరో భవనంలోకి మారుస్తారని సమాచారం. హైదరాబాద్‌ పోలీసులు ప్రత్యేక కేసుల విచారణ సమయంలో నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారించేందుకు ఉపయోగిస్తున్న సిట్‌ కార్యాలయానికి పెద్ద మొత్తంలో అద్దె చెల్లిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఉపయోగించే కార్యాలయానికి అనవసరంగా అద్దె చెల్లించే బదులు సిట్‌ కార్యాలయాన్ని పోలీసు భవనాల్లోకి మార్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం మార్పలు చేర్పులు డిసెంబరు నాటికి పూర్తి చేసే అవకాశం ఉంది.

సీఎం సమావేశాలు ఇక్కడే...

ఐ3సీ కేంద్రంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే పలు కీలక సమావేశాలు నిర్వహించారు. మంత్రులు, సీఎస్‌, డీజీపీ, ఆయా విభాగాల అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇకపై తరచూ ఇక్కడి నుంచే సమావేశాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డీజీపీ, సీఎస్‌, ఇతర ముఖ్య అధికారుల కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల సమావేశాలకు మరింత ఉపయోగకరంగా మారనుంది.

Updated Date - Jul 22 , 2024 | 02:27 AM