Hyderabad: మల్కాజిగిరి నుంచి పోటీకి నై.. యూటర్న్ తీసుకున్న మల్లారెడ్డి కుటుంబం..
ABN , Publish Date - Mar 13 , 2024 | 08:15 AM
దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ స్థానం మల్కాజిగిరి(Malkajigiri)లో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్(BRS) నుంచి ఇక్కడ ఎవరు బరిలో దిగుతారన్నది చర్చనీయాంశంగా మారింది.
- బీఆర్‌ఎస్ నుంచి తెరపైకి కొత్త పేర్లు
- ప్రచారంలో మల్క కొమురయ్య..
- శంభీపూర్ రాజుకూ అవకాశం..?
- పునరాలోచనలో మర్రి జనార్దన్‌రెడ్డి
- మొదట్లో ఆసక్తి.. ఇప్పుడు అనాసక్తి
- ‘కారు’లో మారుతున్న పరిణామాలు
హైదరాబాద్ సిటీ: దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ స్థానం మల్కాజిగిరి(Malkajigiri)లో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్(BRS) నుంచి ఇక్కడ ఎవరు బరిలో దిగుతారన్నది చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు మాజీ మంత్రి మలారెడ్డి(Former minister Mala Reddy) కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అర్థ బలం, మేడ్చల్, మల్కాజిగిరి ఎమ్మెల్యేలుగా వారి కుటుంబసభ్యులే ఉండడం.. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ అగ్రనాయకులూ భద్రారెడ్డి అభ్యర్థిత్వానికి సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా భద్రారెడ్డి పేరిట ఫ్లెక్సీలూ ఏర్పాటు చేశారు. మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన విద్యాసంస్థల భవనాలను అక్రమంగా నిర్మించారంటూ వాటిని కూల్చివేయడం.. ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి కుటుంబం యూటర్న్ తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లను కలిసి తమ కుటుంబం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు. దీంతో మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్ తరఫున అభ్యర్థి ఎవరన్నది ఆసక్తి రేపుతోంది. మొన్నటి వరకు ఈ స్థానం కోసం పార్టీలోని పలువురు నేతలు పోటీపడగా.. తాజా పరిణామాల నేపథ్యంలో పరిస్థితి ఒక్కసారిగా మారింది.
తెరపైకి కొత్త పేర్లు..
మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు(BRS MLC Shambhipur Raju) పేరు మొదటినుంచి వినిపిస్తున్నా.. బలమైన అభ్యర్థి దొరికితే ఆయనకు నచ్చజెప్పాలని పార్టీ నేతలు భావించారు. పోటీ నుంచి మల్లారెడ్డి కుటుంబం తప్పుకున్న నేపథ్యంలో మరోసారి రాజు పేరు తెరపైకి వస్తోంది. మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగానూ ఆయన కొనసాగుతుండడంతో బరిలో నిలిపే అవకాశం లేకపోలేదని ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తెలిపారు. అయితే, రాజు ఎమ్మెల్సీకి రాజీనామా చేయాల్సి వస్తే.. శాసనమండలిలో పార్టీ బలం తగ్గుతుందనే ఆలోచనలోనూ అగ్రనేతలున్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ప్రముఖ విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య పేరు తాజాగా వినిపిస్తోంది. నియోజకవర్గంనుంచి బీజేపీ ఈటల రాజేందర్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో.. ఎలాగైనా పోటీ చేయాలని భావిస్తున్న కొమురయ్య పక్క పార్టీలవైపు చూస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కేసీఆర్, కేటీఆర్‌లతో ఆయన టచ్‌లోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలు, ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్న కొమురయ్యను బరిలోకి దింపడం బీఆర్‌ఎ్‌సకు కలిసి వస్తుందన్న భావన ఉన్నట్టు తెలుస్తోంది. విద్యాసంస్థల అధినేతగా రాజకీయాల్లోనూ మల్లారెడ్డి తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. ఈ నేపథ్యంలో కొమురయ్యకూ అవకాశం ఇవ్వాలనే యోచనలో బీఆర్‌ఎస్ ఉన్నట్టు సమాచారం. ఆర్థిక వనరులూ ఉండడంతో ఎన్నికల ఖర్చూ ఆయనే భరించే అవకాశముంది. గతంలో మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రస్తుతం పునరాలోచనలో ఉన్నట్టు సమాచారం. అనూహ్యంగా కొత్త అభ్యర్థిని బీఆర్‌ఎస్ బరిలో దించే అవకాశం లేకపోలేదని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.
పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలున్నా..
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెంగ్మెట్లలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో టికెట్ కోసం తీవ్ర పోటీ ఉండాలి. మొదట్లో ఆ పరిస్థితి కనిపించినా.. ఇప్పుడు పరిణామాలు మారాయి. ఒక్కొక్కరుగా నేతలు పోటీ చేసేందుకు నిరాసక్తత చూపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో మల్కాజిగిరి, సికింద్రాబాద్(Malkajigiri, Secunderabad) లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట అవకాశమివ్వాలని కోరిన ఓ నాయకుడు, బీఆర్‌ఎస్ అగ్రనేతలు స్పందించకపోవడంతో ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.