Hyderabad: నగరంలో.. గ‘మ్మత్తు’ పబ్‌లు.. కిలోల లెక్కన డ్రగ్స్ దిగుమతి
ABN , Publish Date - Jul 25 , 2024 | 11:57 AM
నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరుగుతున్నది. ఇటీవల నార్కోటిక్ పోలీసులు జరిపిన దాడుల్లో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. చిన్నమొత్తంలో లభించే మాదకద్రవ్యం ప్రస్తుతం కిలోల చొప్పున పట్టుబడుతోంది.
- ఈవెంట్ మేనేజర్లు, డీజేలే కీలకం
- కోడ్ భాషలో పార్టీలకు పిలుపు
- వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం
- గంటలోనే గ్రూప్ మాయం
- పార్టీకి ఎవరొచ్చినా 20 శాతం మందికే మత్తు సరఫరా
నగరంలోని పబ్‌లు డ్రగ్స్ డెన్(Drugs Den)లుగా మారుతున్నాయా..? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు అరుదుగా లభించే డ్రగ్స్ ఇప్పుడు సామాన్య యువతకు కూడా విరివిగా లభిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. గతంలో నగరానికి గ్రాముల్లో వచ్చే డ్రగ్స్ ప్రస్తుతం కిలోల చొప్పున చేరుతోంది. ఇందుకు ఇటీవల పోలీసులకు పట్టుబడిన ముఠాలే సాక్ష్యం. కేవలం నెల వ్యవధిలో రూ.10కోట్ల విలువ గల సరుకు పట్టుబడడం సంచలనంగా మారింది.
హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరుగుతున్నది. ఇటీవల నార్కోటిక్ పోలీసులు జరిపిన దాడుల్లో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. చిన్నమొత్తంలో లభించే మాదకద్రవ్యం ప్రస్తుతం కిలోల చొప్పున పట్టుబడుతోంది. 10 పబ్‌ల యజమానులకు ఇంటర్నేషనల్(International) మాఫియాతో లింక్‌లు ఉన్నట్టు తేలడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. మూడు కమిషనరేట్‌ల పరిధిలో వందకు పైగా పబ్‌లు ఉన్నాయి. వీకెండ్ వచ్చిందంటే నగరవాసులు ఆయా పబ్‌లలో పార్టీల్లో మునిగి తేలుతారు. మద్యం తాగి ఊగుతారు. ఈ మధ్యకాలంలో పబ్‌లలో జరిగే పార్టీలకు డ్రగ్స్ కల్చర్ తోడైంది. మత్తులో యువత చేసే హంగామా బయటకు రాకుండా పబ్ నిర్వాహకులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, అన్ని పబ్‌లలో ఈ డ్రగ్స్ సంస్కృతి ఉందా? అనేది తేలాల్సి ఉంది.
ఇదికూడా చదవండి: Hyderabad: అతి వ్యాయామం అనర్థమే..!
పబ్‌లకు ఎలా వస్తోంది..
నార్కోటిక్ అధికారులు పార్టీలు జరుగుతున్న పబ్‌లపై దాడులు నిర్వహించి పరీక్షలు చేయగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. పబ్‌లకు మత్తు ఎలా సరఫరా అవుతుంది? పార్టీని ఎవరు నిర్వహిస్తున్నారు? డ్రగ్స్ కావాల్సిన వారికి పబ్ వెలుపల అందిస్తున్నారా? లేదా లోపలికి వచ్చాకే దొరుకుతున్నాయా? అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఈవెంట్ మేనేజర్ల పాత్ర ఏమిటి? నిర్వాహకులు ఎలా అనుమతులు ఇస్తున్నారనే దానిపై ఆరా తీయగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసినట్టు సమాచారం. అయితే, తాజాగా రాజస్థాన్ నుంచి ఓ ముఠా ఏడు కిలోల హెరాయిన్ తరలిస్తూ శంషాబాద్ ఎస్‌ఓటీకి పట్టుబడింది. వీరిని విచారించగా మాదాపూర్‌కు చెందిన పబ్ మేనేజర్ కిలో ఆర్డర్ ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు.
ప్రొఫైలింగ్ పై దృష్టి...
విద్యాసంస్థల దగ్గరి నుంచి పబ్‌ల వరకు మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోవడంతో నార్కోటిక్ విభాగం ప్రొఫైలింగ్ (వ్యక్తిగత వివరాల సేకరణ)పై దృష్టి సారించింది. డ్రగ్స్, గంజాయి తీసుకొని పట్టుబడిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతూనే అసలు వారికి మాదకద్రవ్యాలు ఎలా వచ్చాయి అనే అంశంపై ఆరా తీస్తూ అందరి పేర్లతో కలిసి ప్రొఫైలింగ్ చేస్తున్నట్టు అధికారులు ఇటీవల ప్రకటించారు. ఈ విధానం మూడేళ్ల క్రితమే అందుబాటులోకి తెచ్చి ఉంటే ఈ పాటికి నగరంలో డ్రగ్స్ వినియోగం కట్టడి జరిగేదని కొందరు సీనియర్ అధికారులు(Senior officials) అంటున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో అసలు నిందితులను పట్టుకోవడంతో పాటు ప్రొఫైలింగ్ చేసి ఉంటే కేవలం ప్రముఖులతో సరఫరా ఆగిపోయేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియా ద్వారా పిలుపులు
సాధారణంగా పబ్‌లో కొంతమంది కొన్నిరకాల పేర్లతో పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు. దీనికి డ్రెస్‌కోడ్ అని, కేవలం కపుల్స్ మాత్రమే అని, బ్యాచిలర్స్, రెట్రోనైట్ పేరిట ఈవెంట్ మేనేజర్లు పార్టీలు పెట్టడం సాధారణమే. ఇటీవల కాలంలో వీరే ప్రత్యేకంగా కొన్ని పబ్‌లను ఎంచుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు నిర్ధారణ అయింది. ఈవెంట్ మేనేజర్లకు డీజేలు తోడవడంతో పార్టీకి వచ్చే వారికి డ్రగ్స్ దొరకడం తేలికైంది. ఈవెంట్ మేనేజర్లు, డీజేలతో పాటు అతికొద్ది మంది పార్టీ ప్రియులతో కలిసి సోషల్ మీడియాలో ఓ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో మెసేజ్ పెడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఓ గంటలో ఎవరెవరు సమ్మతిస్తారో తెలుసుకొని ఆ తరువాత గ్రూప్‌ను డిలిట్ చేసి అవసరమైన వారికి డ్రగ్స్ అందిస్తున్నారు. ఇందుకోసం ఈవెంట్ మేనేజర్లు, డీజేలకు పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది. అయితే, పార్టీకి 60 నుంచి 70 మందిని నిర్వాహకులు పిలుస్తున్నప్పటికీ అందులో 20 శాతం మందికి మాత్రమే డ్రగ్స్ ఇచ్చేలా సరఫరాదారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తద్వారా ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుంది.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News