Hyderabad: మల్కాజిగిరి.. ‘హస్తం’ గురి! పైచేయి కోసం కసరత్తు
ABN , Publish Date - Apr 13 , 2024 | 09:04 AM
పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి(Malkajigiri)ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. తొలుత జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్‌పై అసమ్మతిని పెట్టి పీఠాన్ని కైవసం చేసుకుంది.
- ఇప్పటికే రెండు కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలో..
- మరో రెండుచోట్ల ‘కారు’ ఖాళీకి వ్యూహాలు
- శివారు మున్సిపాలిటీల్లో ఆపరేషన్ ఆకర్ష్
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి(Malkajigiri)ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. తొలుత జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్‌పై అసమ్మతిని పెట్టి పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈక్రమంలోనే బోడుప్పల్, పీర్జాదీగూడ కార్పొరేషన్ల(Boduppal and Peerjadiguda Corporations) పరిధిలో కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవ్వడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. పార్లమెంట్ సీటును ‘పట్నం’ ఖాతాలో వేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సీరియ్‌సగా దృష్టి సారించారు.
నిజాంపేటపై ఫోకస్
నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో 33 మంది కార్పొరేటర్లు ఉండగా ముగ్గురు మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన మేయర్ కొలను నీలారెడ్డి, డిప్యూటీ మేయర్‌తో సహా మరో 9 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ బలం మూడు నుంచి పన్నెండుకు పెరిగింది. మరో పదిమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
బోడుప్పల్‌లోనూ అవిశ్వాసం దిశగా..
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. 28 మంది కార్పొరేటర్లు ఉన్న బోడుప్పల్ నగరపాలక సంస్థలో గతంలో హస్తం పార్టీకి ఆరుగురి బలం ఉండేది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు హస్తం గూటికి వెళ్లారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో మరో ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. స్థానికంగా ఉంటున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి బోడుప్పల్ కార్పొరేషన్ పాలకవర్గంలో అవిశ్వాసం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మేయర్‌గా ఎన్నికయ్యేలా వ్యూహాలు రచిస్తున్నారు. అవిశ్వాసం పెట్టేందుకు 19 మంది కార్పొరేటర్ల బలం అవసరం ఉండనుంది. ఇప్పటివరకు కాంగ్రెస్ బలం 16కి చేరడంతో మరో ముగ్గురు రావాల్సి ఉంది.
డిప్యూటీ రాకతో పీర్జాదిగూడలో గుబులు
పీర్జాదిగూడ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ 11 మంది కార్పొరేటర్లను తీసుకుని సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అప్పట్లో 26 మంది కార్పొరేటర్లు బీఆర్‌ఎస్ నుంచే గెలిచారు. వారిలో కొందరు కాంగ్రెస్‌లోకి చేరడంతో మరో ఇద్దరి సహకారంతో అవిశ్వాసం పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేయర్ జక్కాను పీఠం దింపేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. నగర బీఆర్‌ఎస్ అధ్యక్షుడు దర్గా దయాకర్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ క్రమంలోనే మరో ఎనిమిది మంది కార్పొరేటర్లు ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరిలో కారు పార్టీని ఖాళీ చేసి కాంగ్రెస్ కంచుకోటగా మార్చే దిశగా నియోజవకర్గ నేతలు అడుగులు వేయాలని ఇప్పటికే సంకేతాలు అందజేశారని తెలుస్తున్నది.
కూన శ్రీశైలం చేరికతో కొంపల్లిపై ఆశలు
కొంపల్లి మున్సిపల్ చైర్మన్ స్థానం ప్రస్తుతం బీఆర్‌ఎస్(BRS) ఖాతాలో ఉంది. అక్కడ బీజేపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు పాలకవర్గంలో ఉన్నారు. కూన శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్ గూటికి రావడంతో బీఆర్‌ఎస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చర్చ సాగుతోంది. బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్‌లోకి చేర్చుకుని బీజేపీ మద్దతుతో అవిశ్వాసం పెట్టేందుకు ప్లాన్ వేస్తున్నారు. దుండిగల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు మరదలు బీఆర్‌ఎస్ నుంచి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. దీంతో బీఆర్‌ఎస్ పటిష్టంగా ఉండటంతో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
ఇదికూడా చదవండి: Hyderabad: అక్కడ.. రాజకీయ ప్రసంగాలు ఉండొద్దు..