Share News

Hyderabad: చెక్కుల పంపిణీలో ప్రొటోకాల్‌ రగడ.. నేలపై బైఠాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Jul 16 , 2024 | 11:00 AM

బోనాల పండుగకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తలెత్తిన ప్రొటోకాల్‌ రగడ వివాదానికి దారితీసింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌(BRS, Congress) శ్రేణులు బాహాబాహీకి తలపడడంతో ఉద్రిక్తతతకు దారితీసింది.

Hyderabad: చెక్కుల పంపిణీలో ప్రొటోకాల్‌ రగడ.. నేలపై బైఠాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్యే

- బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల బాహాబాహి

హైదరాబాద్: బోనాల పండుగకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తలెత్తిన ప్రొటోకాల్‌ రగడ వివాదానికి దారితీసింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌(BRS, Congress) శ్రేణులు బాహాబాహీకి తలపడడంతో ఉద్రిక్తతతకు దారితీసింది. అధికారుల తీరును నిరసిస్తూ వేదిక ఎదుటే స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) నేలపై బైఠాయించారు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. లబ్ధిదారులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెప్పడంపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం ఆర్‌కేపురం డివిజన్‌ పరిధిలోని ఖిల్లా మైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: డ్రగ్స్‌ కేసులో కుమారుడు పట్టుబడ్డాడని బెదిరించి..


ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రొటోకాల్‌, ప్రజాసంబంధాల సలహాదారు వేణుగోపాల్‌రావు ప్రభుత్వ అధికార ప్రతినిధిగా హాజరుకాగా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. దేవాదాయశాఖ అధికారి ముఖ్యఅతిథులను వేదికపైకి పిలిచే క్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డిని కూడా ఆహ్వానించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సబితా ఇంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యేను ఏ విధంగా వేదికపైకి పిలుస్తారని ప్రశ్నించారు. అలా చేస్తే తాను వేదికపై ఉండబోనని చెప్పి వేదిక ముందు నేలపై బైఠాయించారు. దీంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వచ్చారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్‌ శ్రేణులు కూడా ముందుకు రావడంతో ఇరువర్గాల శ్రేణులు బాహాబాహీకి తలపడ్డాయి. వారిని సముదాయించడానికి పోలీసులు ఇబ్బంది పడ్డారు. సబితాఇంద్రారెడ్డిని వేదికపైకి వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని వేణుగోపాల్‌రావు, కార్పొరేటర్‌ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి తదితరులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ససేమిరా అనడంతో వారు మిన్నకుండిపోయారు. ఆందోళన జరుగుతుండగానే వేణుగోపాల్‌రావు అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా నర్సింహారెడ్డి, మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెనగారి లక్ష్మారెడ్డి, పీసీసీ ప్రతినిధి దేప భాస్కర్‌రెడ్డిలతో కలిసి ఆలయ కమిటీల ప్రతినిధులకు బోనాల చెక్కులను పంపిణీ చేసి వెళ్లిపోయారు.


ఓడిన కాంగ్రెస్‌ నేతలతోనే చేపట్టేలా చట్టం తెండి..

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రొటోకాల్‌ను పాటించాలని డిమాండ్‌ చేశారు. ఓడిపోయిన కాంగ్రెస్‌ నేతలతో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తామని చట్టం తీసుకురమ్మని సూచించారు. ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన వ్యక్తులంటే గౌరవం లేకుండా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా కొడంగల్‌లో ఓడిపోయిన అభ్యర్థిని తీసుకొచ్చి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనేలా చేయాలని సూచించారన్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలను ప్రజాప్రతినిధులతో పంపిణీ జరిగేలా చూడాలే తప్ప ఇలా ఓడిపోయిన వారిని ప్రొటోకాల్‌కు విరుద్ధంగా తీసుకొచ్చి గొడవలు జరిగేలా చేయాల్సిన అవసరం ఏమున్నదని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం మాదే అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలు తిరగబడతారని ఆమె హెచ్చరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీలో తులం బంగారం ఇచ్చి మీ పార్టీ అభ్యర్థులను పంపిస్తే హర్షిస్తామన్నారు. ప్రొటోకాల్‌ సమస్యపై తక్షణమే స్పీకర్‌ కలుగజేసుకుని సమస్యను పరిష్కరించాలని ఆమె కోరారు.


ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 11:00 AM