Share News

G. Kishan Reddy: ఫార్మా సిటీగా హైదరాబాద్‌ ..

ABN , Publish Date - Jul 08 , 2024 | 04:34 AM

వ్యాక్సిన్‌ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్‌ను ప్రపంచ ఫార్మా సిటీగా మార్చేందుకు ఔషధ తయారీ సంస్థలకు అన్ని రకాల సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.

G. Kishan Reddy: ఫార్మా సిటీగా హైదరాబాద్‌ ..

  • ఫార్మా యూనివర్సిటీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా ప్రధానితో మాట్లాడతా

  • ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రె్‌సలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): వ్యాక్సిన్‌ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్‌ను ప్రపంచ ఫార్మా సిటీగా మార్చేందుకు ఔషధ తయారీ సంస్థలకు అన్ని రకాల సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధన కోసం ఫార్మా పరిశ్రమ మద్దతు చాలా అవసరమన్న విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. ఫార్మా యూనివర్సిటీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా ప్రధాని మోదీతో మాట్లాడతానని చెప్పారు. హైటెక్స్‌లో ఆదివారం ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ 73వ సదస్సు ముగింపు కార్యక్రమంలో కిషన్‌ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, 2027 నాటికి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయాలన్న సంకల్పంతో ప్రధాని ఉన్నారన్నారు.


ఇందులో భాగంగా మౌలిక సదుపాయాల కోసం నిధులు వెచ్చిస్తున్నామని చెప్పారు. దేశంలో వైద్య కళాశాలలను గణనీయంగా పెంచామన్నారు. 2014లో 388 వైద్య కళాశాలలు ఉండగా, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల గడిచిన పదేళ్లలో వాటి సంఖ్య 706కు చేరిందన్నారు. ఎంబీబీఎస్‌ సీట్లు 51,348 నుంచి 1.09 లక్షలకు చేరాయన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా కేంద్రం 12 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు వైద్య బీమా అందిస్తోందన్నారు. జన ఔషధి కేంద్రాల ద్వారా జనరిక్‌ మెడిసిన్‌ను అందుబాటులోకి తెచ్చామని, తద్వారా 50 నుంచి 90ుతక్కువ ధరకే మందులు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. కాగా, రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు.

Updated Date - Jul 08 , 2024 | 04:34 AM