Share News

Hyderabad: వాన.. మెట్రోలో హైరానా..!

ABN , Publish Date - Aug 17 , 2024 | 08:57 AM

నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మెట్రోరైళ్లు(Metro trains) కిటకిటలాడుతున్నాయి. రోడ్లపై పోటెత్తుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని స్టేషన్లకు పరుగులు తీస్తూ వస్తున్న ప్రయాణికులకు బోగీల్లో చుక్కలు కనిపిస్తున్నాయి.

Hyderabad: వాన.. మెట్రోలో హైరానా..!

- కిక్కిరిసిన బోగీల్లో ప్రయాణం

- ఊపిరాడక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

- అదనపు బోగీల పెంపు ప్రకటనలకే పరిమితం

హైదరాబాద్‌ సిటీ: నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మెట్రోరైళ్లు(Metro trains) కిటకిటలాడుతున్నాయి. రోడ్లపై పోటెత్తుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని స్టేషన్లకు పరుగులు తీస్తూ వస్తున్న ప్రయాణికులకు బోగీల్లో చుక్కలు కనిపిస్తున్నాయి. గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే ఆరాటంతో రైళ్లు ఎక్కుతున్న ప్రయాణికులు కిక్కిరిసిన బోగీల్లో ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో బోగీలో పరిమితికి మించి ప్రయాణిస్తుండడంతో తోపులాటలు, గొడవలు జరుగుతున్నాయి. నగరంలో గురు, శుక్రవారాల్లో వర్షం దంచికొట్టింది. రోడ్లపై పెద్ద ఎత్తున వరద నిలిచిపోయింది. ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ట్రాఫిక్‌ బారినుంచి తప్పించుకుని మెట్రోరైళ్లలో వెళ్తున్న వారికి అక్కడ కూడా ఇబ్బందులు ఉండడంతో అసహనానికి లోనవుతున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మాయమాటలతో బాలికను అపహరించి అత్యాచారం..


రోజుకు 4.60 లక్షల నుంచి..

నగరంలోని మూడు కారిడార్లలో 57 స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 69.2 కిలోమీటర్ల పరిధిలో రోజుకు 1028 సర్వీసులను నడిపిస్తున్నారు. ఈ మేరకు సగటున రోజుకు 4.60 లక్షల నుంచి 4.80 లక్షల మంది వరకు మెట్రోరైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతీ 6 నిమిషాలకోసారి రైలును నడిపిస్తుండడంతో వివిధ వర్గాల ప్రజలు ప్రశాంతంగా ప్రయాణిస్తున్నారు. కాగా, మెట్రో ఒక్కో బోగీలో 126 మంది కూర్చోవడంతోపాటు రైలులో మరో 1000 మంది ప్రయాణించే అవకాశం ఉంది. అయితే సాధారణ రోజుల్లో అంతకంటే ఎక్కువగా సుమారు 1400 మంది ప్రయాణిస్తున్నారు. వర్షాలు కురిసిన సమయంలో ఏకంగా 1800 నుంచి 2000 వేల మంది ప్రయాణిస్తుండడంతో ఊపిరాడని పరిస్థితి ఉంటున్నది. దీంతో చంటి పిల్లలను పట్టుకుని వెళ్తున్న మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

city1.2.jpg


అదనపు కోచ్‌లు కరువు

నగరంలో ట్రాఫిక్‌ రహితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న మెట్రోకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఆటోలు, బస్సులతో పోల్చితే నిమిషాల వ్యవధిలో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు వెళ్లే అవకాశం ఉండడంతో చాలామంది మెట్రోకే మొగ్గు చూపుతున్నారు. అయితే గతేడాది జనవరి నుంచి రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న 171 కోచ్‌లకు అదనంగా మరో 40 నుంచి 50 కోచ్‌లను నాగ్‌పూర్‌ నుంచి తీసుకొస్తామని గతంలో హైదరాబాద్‌ మెట్రో, ఎల్‌అండ్‌టీ అధికారుల ప్రకటించినప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. టికెట్ల ద్వారా ఆదాయాన్ని పొందుతున్న ఎల్‌అండ్‌టీ ప్రయాణికుల ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపించి అదనపు బోగీలను తీసుకురావాలని వారు కోరుతున్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 17 , 2024 | 08:57 AM