Share News

Hyderabad: తొలకరి పలకరింపు..

ABN , Publish Date - Jun 06 , 2024 | 04:41 AM

నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రాన్ని తొలకరి పలకరించింది. పలు జిల్లాల్లో బుధవారం వర్షాలు కురిశాయి. సాయంత్రం వేళ గంటన్నర పాటు కుండపోత వానతో హైదరాబాద్‌ తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులను వరద ముంచెత్తింది. బేగంబజార్‌లో అత్యధికంగా 8.8, బండ్లగూడలో 8.1, సర్దార్‌ మహల్‌లో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం పడింది.

Hyderabad: తొలకరి పలకరింపు..

  • హైదరాబాద్‌లో కుండపోత.. బేగంబజార్‌లో 8.8 సెం.మీ.

  • నల్లగొండ జిల్లా మద్దిరాలలో 5, చౌటుప్పల్‌లో 4 సెం.మీ.

  • భద్రాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో పిడుగు పడి ఇద్దరు మృతి

  • మంగళ్‌హట్‌లో గుట్టపై నుంచి రాయిపడి చిన్నారి దుర్మరణం

  • వచ్చే 2 రోజులు వర్షాలే.. పాలమూరు, రంగారెడ్డిలో భారీగా!

  • హైదరాబాద్‌లో రోడ్లను ముంచెత్తిన వరద.. స్తంభించిన ట్రాఫిక్‌

  • మైత్రీవనంలో మునిగిన కార్లు, బైక్‌లు

  • ఎర్రమంజిల్‌లో తెరుచుకోని మెట్రో తలుపులు.. ఎల్బీనగర్‌లో ఎగ్జిట్‌ కష్టాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రాన్ని తొలకరి పలకరించింది. పలు జిల్లాల్లో బుధవారం వర్షాలు కురిశాయి. సాయంత్రం వేళ గంటన్నర పాటు కుండపోత వానతో హైదరాబాద్‌ తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులను వరద ముంచెత్తింది. బేగంబజార్‌లో అత్యధికంగా 8.8, బండ్లగూడలో 8.1, సర్దార్‌ మహల్‌లో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం పడింది. సూర్యాపేట జిల్లా మద్దిరాల (5 సెంమీ.), యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ (4 సెం.మీ.)లో రెండు గంటల పాటు ఎడతెరిపి లేని వాన కురిసింది. వలిగొండలో మోస్తరు వర్షం పడింది. సంగారెడ్డిలో ఉరుములు, మెరుపులతో గంటసేపు వాన కురవడంతో రోడ్లన్నీ జలమమయ్యాయి.


నాలుగు గంటలు ట్రాఫిక్‌ నరకం

భారీ వర్షం హైదరాబాద్‌లో చిక్కులు తెచ్చిపెట్టింది. హయత్‌నగర్‌ నుంచి కూకట్‌పల్లి వరకు, ఉప్పల్‌ నుంచి గచ్చిబౌలి దాక కిలోమీటర్ల మేర వాహనాలు భారీగా బారులు తీరాయి. మైత్రీవనం చౌరస్తాను వరద ముంచెత్తింది. కార్లు, ద్విచక్ర వాహనాలు సగానికిపైగా మునిగాయి. రెండు గంటలకు పైగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ సమస్య నెలకొంది. బేగంబజార్‌, బండ్లగూడ, కూకట్‌పల్లి, యూసు్‌ఫగూడ, కృష్ణానగర్‌, ఖైరతాబాద్‌, విజయ్‌నగర్‌ కాలనీ, శ్రీనగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మోతీనగర్‌, బాచుపల్లి, శేరిలింగంపల్లి, బేగంబజార్‌లో విద్యుత్తుకు అంతరాయం వాటిల్లింది.


చుక్కలు చూపిన మెట్రో

వర్షం నేపథ్యంలో ప్రజలు మెట్రో రైల్‌ వైపు మొగ్గుచూపారు. పరిమితికి మించడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. రాత్రి 10.30 వరకు రద్దీ కొనసాగింది. ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌ వెళ్తున్న సర్వీస్‌.. ఎర్రమంజిల్‌ స్టేషన్‌లో ఆగాక 10 నిమిషాలు డోర్లు తెరుచుకోలేదు. ప్రయాణికులు డోర్లు కొడుతూ కేకలు వేయడంతో ఆందోళన నెలకొంది. కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఇక్కడ సమస్య పరిష్కరించినప్పటికీ సిగ్నలింగ్‌ ఇబ్బందితో మిగతా రైళ్లు నెమ్మదిగా నడిచాయి. ఎల్‌బీనగర్‌ స్టేషన్‌లో రాత్రి ఫ్లాట్‌ఫారంలపై నుంచి బయటకు వెళ్లే మెషిన్లు పనిచేయకపోవడంతో 20 నిమిషాలు ప్రయాణికులు ఆగిపోయారు.


మామిడి చెట్టుపై పిడుగుతో బాలుడు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం సీతానగరం గ్రామానికి చెందిన బదిర బాలుడు మేకల సంతోష్‌ (13) పిడుగుపాటుతో చనిపోయాడు. సమీప బంధువులు గొగ్గల రంజిత్‌, శివశంకర్‌, శివశంకర్‌తో మామిడి చెట్టు నీడలో ఆడుకుంటూ కాయలు సేకరిస్తుండగా.. గాలి, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసి పిడుగుపడింది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం సంకేపల్లిగూడలో బేగరి వెంకటయ్య (45) పిడుగుపాటుతో చనిపోయాడు. చేవెళ్ల మండలం గుండాలకు చెందిన ఇతడు పనికోసం షాద్‌నగర్‌ వచ్చాడు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం నాగిరెడ్డిపల్లిలో పిడుగు పడి ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం కొత్తగూడెంలో పిడుగు పడి మూడు ఎద్దులు, నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పూల్యాతండా, నీరుటువానిగూడెంలో 20 మేకలు మృత్యువాత పడ్డాయి.


వలస కూలీ ఇంట్లో విషాదం..

నిద్రిస్తున్న చిన్నారిపై రాయి పడి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ మంగళ్‌హట్‌లో జరిగింది. ఆళ్లబండ గుట్టలో బిహార్‌కు చెందిన మహ్మద్‌ షౌకత్‌ భార్య తంజీర్‌ బేగంతో జీవిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షానికి గుట్టపై నుంచి దొర్లిన బండరాయి షౌకత్‌ కూతురు (2)పై పడడంతో తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.


ఐదు జిల్లాలకు భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని నారాయణపేట, ఏపీలోని నర్సాపూర్‌ మీదుగా వెళ్తున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో కర్ణాటకలోని ఇతర ప్రాంతాలు, తెలంగాణ, కోస్తాంధ్రలోని మరికొన్ని ప్రాంతాల్లో ప్రవేశించ వచ్చని వెల్లడించింది. వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నల్లగొండ, సంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా పది సెంటీమీటర్ల లోపు వర్షాలు కురవొచ్చని చెప్పింది.

Updated Date - Jun 06 , 2024 | 04:41 AM