Crime News: అప్పటివరకూ దోస్త్ మేరా దోస్త్ అనుకున్నారు.. కాసేపటికే..!
ABN , Publish Date - Aug 10 , 2024 | 08:42 AM
మద్యం మత్తులో ఓ వ్యక్తి తన స్నేహితుడు, అతని తల్లిపై కత్తితో దాడి చేసిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేరని మద్యం తాగిన స్నేహితులు మత్తులో గొడవకు దిగారు. అది కాస్త చిలికి చిలికి గాన వాన కాగా.. అడిగేందుకు వచ్చిన ఫ్రెండ్ తల్లిపై యువకుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఆమెను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి తన స్నేహితుడు, అతని తల్లిపై కత్తితో దాడి చేసిన ఘటన కూకట్‌పల్లి(Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేరని మద్యం తాగిన స్నేహితులు మత్తులో గొడవకు దిగారు. అది కాస్త చిలికి చిలికి గాన వాన కాగా.. అడిగేందుకు వచ్చిన ఫ్రెండ్ తల్లిపై యువకుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఆమెను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి రాఘవేంద్ర సొసైటీలో జగదీశ్, వినోద్, సాయికుమార్ అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. కుటుంబసభ్యులు ఊరెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరని జగదీశ్, సాయికుమార్‌ను పిలిచి వినోద్ మద్యం పార్టీ ఇచ్చాడు. అప్పటివరకూ దోస్త్ మేరా దోస్త్ అనుకున్న జగదీశ్, వినోద్ మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. దీంతో ఇద్దరు కోపోద్రిక్తులై ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.
అనంతరం అక్కడ్నుంచి వెళ్లిపోయిన జగదీశ్ జరిగిన విషయాన్ని తల్లి పార్వతికి చెప్పాడు. ఘటనపై ప్రశ్నించేందుకు ఆమె కుమారుడితో కలిసి వినోద్ ఇంటికి వెళ్లారు. గొడవపై వినోద్‌ను ఆమె నిలదీయగా.. అతను తల్లీకుమారుడిని తీవ్ర దుర్భాషలాడాడు. కాసేపు వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వీరిద్దరూ ఇంటికి వస్తున్న సమయంలో వినోద్ ఒక్కసారిగా జగదీశ్‌పై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన పార్వతిపైనా దాడి చేయగా.. ఆమెకు భుజానికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఇద్దరినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.