Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
ABN , Publish Date - Mar 24 , 2024 | 08:50 AM
హైదరాబాద్: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపుతోంది. ప్రణీత రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆదివారం ఉదయం గాంధీ అస్పత్రికి తరలించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) సంచలనం రేపుతోంది. ప్రణీత రావు (Praneetha Rao) ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు (Bhujangarao), తిరుపతన్నలను (Tirupattana) పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆదివారం ఉదయం గాంధీ అస్పత్రికి (Osmania Hospital) తరలించారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా వెస్ట్ జోన్ డీసీపీ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖుల వ్యక్తిగత ఫోన్లను టాపింగ్ చేసినట్లుగా గుర్తించారు. అనధికారికంగా పలువురి ఫోన్లను ట్యాపింగ్ చేశారు. కొంతమంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అధికారిక డ్యూటీలో ఉండి కొంతమంది వ్యక్తుల కోసం పనిచేసినట్లు గుర్తించారు. గత ప్రభుత్వానికి ఫోన్ టాపింగ్ చేసి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. టాపింగ్ డివైస్‌లతోపాటు హార్డ్‌వేర్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు నిర్దారించారు.
కాగా ఈ కేసులో గతంలో ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీగా పనిచేసిన తిరుపతన్న, ఇంటెలిజెన్స్ టాప్ సీక్రెట్ వింగ్‌లో చేసిన మరో అదనపు ఎస్పీ భుజంగరావును శనివారం వేర్వేరుగా అదుపులోకి తీసుకొని ఆరేడు గంటల పాటు విచారించారు. వీరి నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం భుజంగరావు భూపాలపల్లి అదనపు ఎస్పీగా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులపై ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి వారికి సంబంధించిన ప్రొఫైల్ తయారు చేశామని, అందుకు సంబంధించిన సాక్షాలను నాశనం చేశామని తిరుపతన్న, భుజంగరావు విచారణలో అంగీకరించారు. దీంతో వీరిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా బీఆర్‌ఎస్‌కు చెందిన డబ్బులను వీరిద్దరే వాహనాల్లో తరలించారని విచారణలో తేలింది. అలాగే గతంలో ఎస్‌ఐబీలో పనిచేసి ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ ధనుంజయ్.. పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరై ఇప్పటికే తన వాంగ్మూలాన్ని ఇచ్చి వెళ్లారు. ఆ తర్వాత వరంగల్‌కు చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ప్రణీత్‌రావు బ్యాచ్‌మెట్స్ సైతం విచారణకు వచ్చి వెళ్లినట్లు తెలిసింది. ఇక గత పాలకుల మెప్పు కోసం, వారికి రాజకీయ లబ్ధి కలిగించేందుకే పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ కుట్రకు పాల్పడినట్లుగా విచారణాధికారులు గుర్తించారు. ఈ కుట్రలోని పాత్రధారులందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి లబ్ధి పొందిన నేతలెవరనేది ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. ఇందులో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు నేతల ప్రమేయమున్నట్లుగా తెలిసింది.