Allu Arjun Case: అల్లు అర్జున్‌పై అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్..
ABN , Publish Date - Dec 21 , 2024 | 02:52 PM
Pushpa-2: సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాట ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 21: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాట ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ వ్యవహార శైలిని ప్రస్తావించారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా జరిగిన తొక్కీసలాటలో ఓ మహిళ మృతి చెందినా హీరో సినిమాను చూసి వెళ్లారని విమర్శించారు. దుర్ఘటనపై బాధ్యత లేకుండా సినిమా చూసి వెళ్లేటప్పుడు అభిమానులకు చెయ్యి ఊపుతూ వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ బాధ్యతారహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కామెంట్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. సంథ్య థియేటర్ ఘటన విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు.. ఆ ఘటనను తప్పు పడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటుడిని అరెస్ట్ చేస్తే చాలా రాద్ధాంతం చేశారని.. అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటని సీఎం ప్రశ్నించారు. సంథ్య థియేటర్ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. డిసెంబర్ 2వ తేదీన పోలీసులకు సంథ్య థియేటర్ యాజమాన్యం బందోబస్తు కావాలంటూ దరఖాస్తు చేసిందని సీఎం వివరించారు. హీరో, హీరోయిన్, సినీ నిర్మాణ సిబ్బంది వస్తారని అందులో పేర్కొన్నట్లు చెప్పారు.
అయితే, థియేటర్ యాజమాన్యం చేసిన అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారని సీఎం గుర్తు చేశారు. సంధ్య థియేటర్ పరిసరాల పరిస్థితుల దృష్ట్యా.. సెలబ్రిటీలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారన్నారు. దరఖాస్తు తిరస్కరించినా సెలబ్రీటీలు థియేటర్‌కు వచ్చారన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ రోడ్ షో చేస్తూ థియేటర్‌కు వచ్చారని.. అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందని సీఎం రేవంత్ తెలిపారు.
ఈ తొక్కీసలాటలో రేవతి అనే మహిళ చనిపోయారని సీఎం వివరించారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన రేవతి కొడుకు చావుబతుకుల్లో ఉన్నాడన్నారు. ఇద్దరు చనిపోయారని పోలీసులు చెప్పినా సినిమా చూసి.. అల్లుఅర్జున్ రూప్‌టాప్‌పై చేతులు ఊపుతూ వెళ్లారంటూ సీఎం నిప్పులు చెరిగారు. బాధితులను పరామర్శించేందుకు కూడా హీరో వెళ్లలేదన్నారు. అల్లు అర్జున్‌కు ఏమైందని.. సెలబ్రిటీలు పరామర్శకు వెళ్తున్నారంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు.