TS Politics: ముగిసిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల దరఖాస్తు గడువు.. ఆ నేతల ప్రధాన ఫోకస్ అక్కడే!
ABN , Publish Date - Feb 03 , 2024 | 08:05 PM
పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament Elections) కాంగ్రెస్(Congress) టికెట్ల దరఖాస్తుల కోసం ఆశావాహులు బారీగా పోటీ పడ్డారు. అయితే ఈ దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది.
హైదరాబాద్: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన బూస్టప్‌తో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈ సారి ఎన్నికల్లో పెద్ద మొత్తంలో సీట్లు గెలవాలని కాంగ్రెస్ అగ్ర నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో ఎక్కువ సీట్లను గెలిస్తేనే కేంద్రంలో చక్రం తిప్పడానికి అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ హై కమాండ్ భావిస్తోంది. దీనిలో భాగంగా క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ప్లాన్‌లో భాగంగానే గత కొన్ని రోజులుగా దరఖాస్తులను స్వీకరిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament Elections) కాంగ్రెస్(Congress) టికెట్ల దరఖాస్తుల కోసం ఆశావహులు భారీగా పోటీ పడ్డారు. అయితే ఈ దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. దరఖాస్తులకు ఆశావహుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గానూ 300 లకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
చివరి రోజు 160కు పైగా దరఖాస్తులు
చివరిరోజు (శనివారం) అయితే 160కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, వీహెచ్ ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రముఖుల్లో మోత్కుపల్లి నర్సింహులు, కపిలవాయి దిలీప్ కుమార్, బండ్ల గణేష్, గడ్డం వివిక్ కుమారుడు వంశీ, సర్వే సత్యనారాయణ, పటేల్ రమేష్ రెడ్డి, జానారెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, మల్లురవి తదితరులు ఉన్నారు. రిజర్వ్ సీట్ల కోసం పార్టీ అధికార ప్రతినిధులు, వైస్ ప్రెసిడెంట్లు దామోదర్ అవేలి, సామ రామ్మోహన్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి.. అలాగే పలువురు ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థి నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వ్ సీట్లు వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాబాద్‌లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ఎలక్షన్ కమిటీకి టీపీసీసీ సభ్యులు పంపనున్నారు.ఫిబ్రవరి రెండో వారంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానున్నట్లు సమాచారం. గెలుపు గుర్రాలను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.