TS Raj Bhavan: ఇటు.. రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’.. అటు మాటల యుద్ధం..!
ABN , Publish Date - Jan 26 , 2024 | 06:54 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడిన తర్వాత మొదటిసారి రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆతిథ్యం ఇవ్వగా.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడిన తర్వాత మొదటిసారి రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆతిథ్యం ఇవ్వగా.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని ప్రముఖులను గవర్నర్ రాజ్‌భవన్‌కు ఆహ్వానించి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గానీ.. ఆ పార్టీ తరఫున ముఖ్య నేతలెవ్వరూ హాజరుకాలేదు. ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, గోరటి వెంకన్నలు మాత్రమే కార్యక్రమానికి హాజరయ్యారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా గైర్హాజరు మాత్రం పరిపాటిగా వస్తోందనే విమర్శలు బీఆర్ఎస్‌పై గట్టిగానే వస్తున్నాయి. బీజేపీ నుంచి మాత్రం కొందరు కీలక నేతలు హాజరయ్యారు.
మాటల యుద్ధం..
కాగా.. రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో తమిళిసై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని గవర్నర్ గుర్తుచేశారు. ఇటు ఎట్ హోం కార్యక్రమం జరుగుతుండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలి. గవర్నర్ బీజేపీ ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు. గణతంత్ర దినోత్సవ వేదికపై రాజకీయాలు మాట్లాడటం బాధాకరం. గవర్నర్ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం’ అని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు.