Johney Master: జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల
ABN , Publish Date - Oct 25 , 2024 | 05:14 PM
లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీబాషా అలియాస్ జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని.. హైదరాబాద్ తీసుకొచ్చి చంచల్ గూడ జైలుకు తరలించారు.
హైదరాబాద్: అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Choreographer Jani Master) ఇవాళ( శుక్రవారం) చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంచల్ గూడ జైలు నుంచి నీ మాస్టర్ బయటకు వచ్చారు. 36 రోజులు పాటు ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు.
గోవాలో అదుపులోకి..
లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని.. హైదరాబాద్ తీసుకువచ్చారు. జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి జీరో ఎఫ్‌ఐఆర్ కాగా, అదే రోజున నార్సింగ్ పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారు.
ముంబైలో షూటింగ్ సమయంలో వేధింపులు...
2017లో ఓ కాంటెస్ట్‌లో పాల్గొనే అవకాశం వచ్చిన బాధితురాలు.. హైదరాబాద్‌కు వచ్చారు. 2019 నుంచి జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ముంబైలో షూటింగ్ సమయంలో అక్కడ హోటల్ గదిలో తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఉద్యోగంలోంచి తీసేస్తానని, సినిమాల్లో ఎక్కడా పని దొరకకుండా చేస్తానని బెదిరించినట్లు తెలిపారు. దాంతో తాను మిన్నకుండిపోవడాన్ని అవకాశంగా తీసుకుని, తరచూ షూటింగ్ ప్రదేశాల్లో వేధించేవాడని.. వ్యానిటీ వ్యాన్‌లో తన కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టేవాడని వివరించారు. ఒప్పుకోకుంటే తన జుట్టు పట్టుకుని దాడి చేసేవాడని.. ఓ సందర్భంలో అద్దంతో నా ముఖంపై కొట్టాడని వాపోయారు. మాట వినకపోతే.. షూటింగ్ లొకేషన్‌లో అందరి ముందు అవమానపరిచేవాడని, అసభ్యంగా తాకేవాడని తెలిపారు. మతం మారి, తనను పెళ్లి చేసుకోవాలని హింసించేవాడని చెప్పారు.
మతం మారాలని వేధించేవాడు
జానీ మాస్టర్ వేధింపులు పెరగడంతో.. తాను సొంతంగా పనిచేయడం ప్రారంభించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. దీంతో జానీ మాస్టర్ ఓ రోజు తన భార్యతో కలిసి ఇంటికి వచ్చినట్లు చెప్పారు. వారిద్దరూ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారని, జానీ మాస్టర్ భార్య తనపై చేయి చేసుకున్నారని వివరించారు. ఓ సారి రాత్రి ఇంటికి వచ్చి, తలుపు తట్టాడని, తాను స్పందించకపోవడంతో.. బయట పార్క్ చేసి ఉన్న తన స్కూటీని ధ్వంసం చేశాడని తెలిపారు. తాను షూటింగ్‌లో ఉన్న ప్రాంతానికి వచ్చి, గొడవపడేవాడని, పెళ్లి చేసుకుంటానని, మతం మారాలని అందరి ముందు వేధించేవాడని వెల్లడించారు. ‘‘ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నాపై దాడికి యత్నించారు. గుర్తుతెలియని పార్సిల్ పంపి భయభ్రాంతులకు గురిచేశారు. ఇండస్ట్రీలో నేను ఒప్పుకొన్న పనులను కూడా చేయకుండా జానీ మాస్టర్ వేధింపులకు గురిచేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోగలరు’’ అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.