TS Politics:సీఎం రేవంత్‌రెడ్డి అలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు: బాల్క సుమన్
ABN , Publish Date - Feb 04 , 2024 | 06:41 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తన పదవిని మరిచి స్థాయి తగ్గించుకుని మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత బాల్క సుమన్(Balka Suman) మండిపడ్డారు. ఆదివారం నాడు చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తన పదవిని మరిచి స్థాయి తగ్గించుకుని మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత బాల్క సుమన్(Balka Suman) మండిపడ్డారు. ఆదివారం నాడు చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు అత్యాశ చూపి కాంగ్రెస్ అధికారం చేజిక్కించు కుందన్నారు. డిసెంబర్ 9వ తేదీన చేస్తామన్న రుణమాఫీ, 4 వేల రూపాయల పెన్షన్, 5వందల రూపాయల గ్యాస్, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ సహా ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే అవసరం బీఆర్ఎస్‌కు లేదన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తామని.. గొంతుకగా నిలుస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకువస్తామన్నారు. గత ఎన్నికల్లో చెన్నూరు అభ్యర్థి వివేక్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వివేక్‌ను చెన్నూరు నియోజకవర్గానికి నిధులు తీసుకురమ్మంటే, తన కొడుకు ఎంపీ సీటు కోసం ఢిల్లీ, హైదరాబాద్‌లో బిజీగా ఉంటున్నారని మండిపడ్డారు.బీఆర్ఎస్ కుటుంబ పాలన అయితే వినోద్, వివేక్ ఎమ్మెల్యేలు ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఇప్పుడు తన కొడుకు వంశీకి ఎంపీ టిక్కెట్టు కోసం ఆశపడటం కుటుంబ పాలన కాదా..? అని నిలదీశారు. సింగరేణి బొగ్గు బావులను అదానీకి అప్పజెప్పేందుకు రేవంత్, వివేక్ ఒప్పందం చేసుకున్నారన్నారు. తాను చెన్నూరు విడిచి వెళ్లిపోతారని దుష్పచారం చేస్తున్నారని.. మళ్లీ ఈ నేలపై గులాబీ జెండా ఎగరేవరకు తన ఇల్లే అడ్డా అని చెన్నూరే తన ఇలాకా అని బాల్క సుమన్ పేర్కొన్నారు.