Bandaru Dattatreya: హిందూసమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే శక్తులకు సరైన బుద్ధి చెప్పాలి
ABN , Publish Date - Sep 17 , 2024 | 05:40 PM
సమాజంలో అందరినీ సమైక్యంగా కలుపుకునేవే గణేష్ ఉత్సవాలని హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. కులం, మతం, భాషా. ప్రాంతం అనే తేడా చూడకుండా మనమంతా ఒక్కటే అనే భావన ఉంటుంది అని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర ఈరోజు(మంగళవారం) ఘనంగా జరుగుతోంది. నిమజ్జనానికి తరలి వేళ్లే వినాయక వాహనాల శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ట్రాఫిక్ జాం నెలకొంది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం జరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. అయితే ఈ యాత్రలో హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో బండారు దత్తాత్రేయ మాట్లాడారు.
సమైక్యంగా కలుపుకునేవే గణేష్ ఉత్సవాలు....
‘‘హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే శక్తులకు సరైన బుద్ధి చెప్పాలని బండారు దత్తాత్రేయ హెచ్చరించారు. ఈరోజు అనంత చతుర్దశి.. మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవం. 1948 అనంత చతుర్దశి రోజు హైదరాబాద్‌కు విమోచనం లభించింది. నిజం కబంధహస్తాల నుంచి రాష్ట్రానికి విమోచనం జరిగింది. తెలంగాణ విమోచనం జరిగిన రోజు కూడా ఇదే ఆనందం ప్రజల్లో ఉంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం. మోదీ భారత దేశాన్ని మరింత ముందుకు నడిపే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలి. విశ్వకర్మ జయంతి ఇదే రోజు. చాలా మంచి రోజు. సమాజంలో అందరినీ సమైక్యంగా కలుపుకునేవే గణేష్ ఉత్సవాలు. కులం, మతం, భాషా. ప్రాంతం అనే తేడా చూడకుండా మనమంతా ఒక్కటే అనే భావన ఉంటుంది’’ అని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతిని కాపాడుతున్నారు...
‘‘గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నా వేలాదిమందిని చూస్తుంటే ఆనందంగా ఉంది. మహిళలు, పిల్లలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్నారు. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతోంది. మన సంస్కృతి సంప్రదాయాల్లో మహిళలను గౌరవిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. నేను హర్యానా గవర్నర్‌నే కాదు.. అంతకు ముందు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తను. 1981 నుంచి నేను ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను’’ అని బండారు దత్తాత్రేయ వెల్లడించారు.