Share News

Chhattisgarh: ఇద్దరు ఆదివాసీ యువకులను ఎత్తుకెళ్లిపోయిన మావోయిస్టులు.. చివరికి..

ABN , Publish Date - Dec 23 , 2024 | 01:08 PM

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూర్ పోలీస్ స్టేషన్ పరిధి కోర్చోలి గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ యువకులను మావోయిస్టులు శనివారం నాడు ఎత్తుకెళ్లిపోయారు. స్థానిక మార్కెట్‌కు వెళ్లిన వారిని కత్తులతో బెదిరించి బలవంతంగా తీసుకెళ్లిపోయారు.

Chhattisgarh: ఇద్దరు ఆదివాసీ యువకులను ఎత్తుకెళ్లిపోయిన మావోయిస్టులు.. చివరికి..
Bijapur Maoists

ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ (Bijapur) జిల్లాలో మావోయిస్టులు (Maoists) దారుణ ఘటనకు పాల్పడ్డారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ల (Police Informers) నెపంతో ఇద్దరు యువకులను హత్య చేశారు. గంగులూర్ పోలీస్ స్టేషన్ పరిధి కోర్చోలి గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ యువకులను మావోయిస్టులు శనివారం నాడు ఎత్తుకెళ్లిపోయారు. స్థానిక మార్కెట్‌కు వెళ్లిన వారిని కత్తులతో బెదిరించి బలవంతంగా తీసుకెళ్లిపోయారు. అయితే ఇవాళ (సోమవారం) నాడు ప్రజాకోర్టు నిర్వహించిన మావోలు.. ఇద్దరినీ పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా నిర్ధరించారు. ఆ నెపంతో గంగులూరు ఏరియా కమిటీ సభ్యులు వారిని హత్య చేసి స్థానిక అటవీ ప్రాంతంలో పడేశారు. గంగులూరు ఏరియా కమిటీ పేరుతో లేఖను మృతదేహాల వద్ద వదిలిపెట్టారు. ఘనటపై కేసు నమోదు చేసిన బీజాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మావోయిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు సహా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా దళాలు, పోలీసులు భారీగా కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు మావోలు తారసపడడంతో పెద్దఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. నారాయణపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో అక్టోబర్ 05న భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 40 మంది మావోలు మృతిచెందారు.


నవంబర్ 22న సుకుమా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధి బజ్జి అటవీ ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 12 మంది మృతిచెందగా.. డిసెంబర్ 12న అబూజ్​మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ఏరియాలో డిసెంబర్ 1న భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ బలగాలు, మావోలకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - Dec 23 , 2024 | 01:25 PM