CM Revanth: డ్రామాలొద్దు కేసీఆర్.. బట్టలు పట్టుకుని అసెంబ్లీకి రా!
ABN , Publish Date - Feb 04 , 2024 | 04:14 PM
అసెంబ్లీ సమావేశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ సమావేశాలపై క్యాబినేట్‌తో చర్చించిన తర్వాత.. నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం నాడు తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలపై క్యాబినేట్‌లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రాజెక్టులపై శాసనసభ, మండలి ఉమ్మడి సమావేశాలు పెట్టడానికైనా రెడీ అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. 48 గంటలు కాకపోతే 2 రోజులు కంటిన్యూ చేయడానికైనా రెడీగా ఉన్నామన్నారు. బట్టలు పట్టుకొని సమావేశాలకి రమ్మని పిలుపునిచ్చారు.
రండి తేల్చుకుందాం..!
ప్రభుత్వం తరపున తాను, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతామన్నారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీశ్ రావు సమస్యలపై ఎంత సేపయినా అసెంబ్లీలో మాట్లాడవచ్చన్నారు. వారిద్దరూ మాట్లాడినంత సేపు ఒక నిమిషం కూడా మైక్ కట్ చేయమని అన్నారు. కేసీఆర్‌కు చిత్త శుద్ది ఉంటే సమావేశాలకు తప్పకుండా రావాలని హితవు పలికారు. ఎవరు తెలంగాణను ముంచారో తేల్చుదామని సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ తప్పకుండా రావాలన్నారు. కాలునొప్పి, కంటి నొప్పి అని కేసీఆర్ డ్రామాలు చేయొద్దని అన్నారు. ప్రాజెక్టులపై రెండు రోజులు చర్చిద్దామన్నారు. కేసీఆర్‌కు అధికారం పోయాక ఎక్కడ నొప్పి పుడుతుందో రాష్ట్ర ప్రజలకు తెలుసునని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాశాడని... దాన్ని తిరగరాసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనలను కేంద్రప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని.. ఇప్పటి నుంచి ప్రతి సమావేశానికి వెళ్లి తమ వాదనలు వినిపిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ లంకె బిందెలాగా ఉండేది.. కానీ కల్వకుంట్ల కుంటుంబం దోచుకొని మట్టి బిందెను పెట్టారని ఎద్దేవా చేశారు. అందుకే కేసీఆర్ కుటుంబాన్ని గజదొంగలంటారని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.