Share News

Congress: డీఎస్ పార్థివ దేహంపై కాంగ్రెస్ కండువా

ABN , Publish Date - Jun 29 , 2024 | 04:07 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Congress: డీఎస్ పార్థివ దేహంపై కాంగ్రెస్ కండువా
Dharmapuri Srinivas

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు జరపనున్నది. అయితే కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ పార్ధీవదేహంపై పార్టీ కండువా, జెండా కప్పి కాంగ్రెస్ నేతలు గౌరవించారు.

డీఎస్ పార్థివ దేహంపై కాంగ్రెస్ కండువా కప్పగానే డీఎస్ చివరి కోరిక తీరిందని ఆయన స్నేహితులు చెబుతున్నారు. డీఎస్‌కు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ నివాళి అర్పించారు. డీఎస్ పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. డీఎస్ కుమారులు సంజయ్, అరవింద్‌లను పరామర్శించారు.


రాజారామ్ శిష్యుడిగా...

డి. శ్రీనివాస్ మరణం కాంగ్రెస్ పార్టీకి, బలహీన వర్గాలకు తీరని లోటని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగారని గుర్తుచేసుకున్నారు. ఆ నాటి కాంగ్రెస్ పెద్దలు రాజారామ్ శిష్యుడిగా ఉమ్మడి రాష్ట్రానికి శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షులుగా ఎదిగారని చెప్పారు.


రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా సారథ్యం వహించిన శ్రీనివాస్ కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశారని తెలిపారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి అనేక సంస్కరణలు తెచ్చారని గుర్తుచేశారు. డీఎస్ ఆకాల మరణం తమకు తీరని లోటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పక్షాన శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతిని మల్లు భట్టి విక్రమార్క వ్యక్తం చేశారు.

Updated Date - Jun 29 , 2024 | 06:24 PM