Telangana Assembly: అసెంబ్లీ లో అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షం
ABN , Publish Date - Feb 17 , 2024 | 01:01 PM
తెలంగాణ అసెంబ్లీలో ప్రాజెక్టులపై అధికార.. విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. పదేళ్లలో ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని పబ్బం గడిపారని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రాజెక్టులపై అధికార.. విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. పదేళ్లలో ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని పబ్బం గడిపారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎక్కడ ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కుర్చీ వేసుకొని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడకు పోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
అంతకు ముందు సాగునీటి రంగంపై శాసనసభలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా నీటి వాటాలు, ప్రాజెక్టుల అప్పగింతలపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రం ఏర్పాటు నాటికి 57 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. 2014-23 మధ్య ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.1.81 లక్షల కోట్లు అని.. ఒక్కో ఎకరానికి అయిన ఖర్చు రూ.11 లక్షలు అని చెప్పుకొచ్చారు. గతంతో పోలిస్తే ఒక్కో ఎకరానికి ఖర్చు 12 రెట్లు పెరిగిందన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి కావడానికి రూ.1.75 లక్షల కోట్లు కావాలన్నారు.
తెలంగాణ వచ్చినా కూడా నీళ్ల దోపిడీ ఆగలేదన్నారు. గత పదేళ్ల పాలనలో నీళ్ల దోపిడీ పెరిగిందని ఆరోపించారు. గత పాలకులు ఇంజినీర్లు, నిపుణుల సూచనలు పట్టించుకోకుండా సొంత ఇంజినీరింగ్ ఆలోచన చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. కృష్ణా జలాల్లో న్యాయబద్ధంగా రావాల్సిన వాటా సాధనలో విఫలమయ్యారన్నారు. కృష్ణా జలాల్లో మన వాటా కోసం గత ప్రభుత్వం పట్టుపట్టలేదని.. బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం వల్లే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఓంపీలు వచ్చాయన్నారు. కేసీఆర్ విధానాల వల్లే హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. కృష్ణా బేసిన్‌లో న్యాయంగా తెలంగాణకు 68 శాతం వాటా రావాలన్నారు. 550 టీఎంసీల జలాలు తీసుకోవాలనే స్పృహ నాటి పాలకులకు లేదన్నారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగింతకు గత ప్రభుత్వమే సూచనప్రాయంగా అంగీకరించిందని మంత్రి చెప్పుకొచ్చారు.