Nampalli Court: కేటీఆర్ స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్న కోర్టు..
ABN , Publish Date - Oct 23 , 2024 | 09:17 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్.. మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డు చేయనుంది. గత విచారణ సందర్భంగా కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్ కోరారు.
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై బుధవారం నాంపల్లి స్పెషల్ కొర్టు (Nampally Special Court)లో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR).. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డు చేయనుంది. గత విచారణ సందర్భంగా కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. దీంతో విచారణను నాంపల్లి స్పెషల్ కోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. కేటీఆర్ ఈ రోజు కోర్టుకు హాజరయి స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. మరోవైపు సీనిహీరో నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో కొండా సురేఖ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. నాగార్జున పిటిషన్‌తో ఇప్పటికే నాంపల్లి స్పెషల్ కోర్టు కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది.
కాగా అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) కారణమంటూ మంత్రి కొండా సురేఖ (Minister konda Surekha) చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి అనేక కామెంట్స్ కూడా చేశారు. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్‌లో పిటిషన్ వేశారు. తనపై చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
నాగార్జున పిటిషన్‌పై..
కాగా.. ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హీరో నాగార్జున పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంత్రిపై నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఈనెల 8వ తేదీన పిటిషన్ దారుడు నాగార్జున, సాక్షిగా ఉన్న సుప్రియలు స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డు చేసింది. వారి స్టేట్‌మెంట్లు తీసుకున్న అనంతరం కోర్టు మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.
అక్టోబర్ 8న నాగార్జున వేసిన పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. ప్రొసిజర్ ప్రకారం పిటిషనర్ వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది. నాగార్జున స్టేట్‌మెంట్ తర్వాత సాక్షుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసింది. కోర్టుకు నాగార్జునతో పాటు భార్య అమల, కుమారుడు నాగ చైతన్య, సుప్రియ, అట్ల వెంకటేశ్వర్లు, సుశాంత్ తల్లి, నాగార్జున సోదరి నాగసుశీల హాజరయ్యారు. వాంగ్మూలంలో మంత్రిపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మా కుటుంబం పట్ల ఆధారాభిమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా కుమారుడు విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణం అని మంత్రి అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడం వల్ల మా పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశంతో మంత్రి ఇలాంటి వాఖ్యలు చేశారు. ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉన్న తన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది. మంత్రి మాట్లాడిన మాటలు అన్ని టెలివిజన్ ఛానెల్స్‌లో ప్రసారం చేశాయి. అన్ని పేపర్స్ ప్రచురితం చేశాయి. దీని వల్ల మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. దేశ వ్యాప్తంగా మా కుటుంబంపై తీవ్ర ప్రభావం పడింది. ఇలా మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల మా కుటుంబానికి నష్టం జరిగింది. మా కుటుంబం మానసిక క్షోభకు గురైంది’’ అంటూ కోర్టుకు నాగార్జున స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసులతో నిందితుడికి సంబంధాలపై విచారణ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ నేడు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News