Film Industry: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.. ఇందుకేనా..
ABN , Publish Date - Dec 26 , 2024 | 10:21 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాలీవుడ్ సినీ ప్రముఖులతో ఈరోజు కమాండ్ కంట్రోల్ రూంలో సమావేశం మొదలైంది. ఈ భేటీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి, టికెట్ ధరల పెంపు, చిన్న సినిమాలకు థియేటర్స్ కేటాయింపు వంటి పలు అంశాలు చర్చకు రానున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy)తో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈరోజు కమాండ్ కంట్రోల్ రూంలో భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించేందుకు సినీ ప్రముఖులు ఇప్పటికే చేరుకున్నారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, చిన్న మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రోత్సాహకాలు, అవార్డుల నిర్వహణ, టికెట్ ధరల పెంపు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఈ అంశాలపై ప్రధాన చర్చ
ఈ క్రమంలోనే ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించనున్నారు. టికెట్ ధరలు పెంచడం, బెనిఫిట్ షోల రద్దు వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో కీలకంగా మారనున్నాయి. దీంతోపాటు సినీ పరిశ్రమలో ఉన్న సంస్కరణలు, తాజా సంఘటనలు, అభివృద్ధి కోసం ప్రభుత్వ సహాయం, టికెట్ ధరలు పెంచడం వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రాముఖ్యంగా ఉన్నాయి. సినిమాలను దేశీ, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించడం వంటి అంశాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరనున్నారు.
ఈ సమావేశానికి హాజరుకానున్న ప్రముఖులు
ఈ భేటీలో టాలీవుడ్ ప్రముఖులు దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, నాగార్జున, కిరణ్ అబ్బవరం, వెంకటేష్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అమిత్ రాజ్, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, హరీష్ శంకర్, నాగ వంశీ, దగ్గుబాటి వెంకటేష్, ఏషియన్ బాలాజీ, నితిన్ వంటి దాదాపు 36 మంది ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీంతోపాటు సీ కల్యాణ్, వశిష్ట, సాయిరాజేష్, బోయపాటి శీను, రోహిన్ రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు.
భేటీ తర్వాత
ఈ భేటీ తర్వాత తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, సినీ ప్రముఖులు కలిసి కొత్త పథకాలు, సాయం, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ప్రోత్సహకాలను ప్రచారం చేయాలని ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
నేడు కర్ణాటకకు రేవంత్.. విషయం ఇదే..
Read Latest Telangana News And Telugu News