KTR: మిత్తీతో సహా చెల్లిస్తాం.. కేటీఆర్ వార్నింగ్
ABN , Publish Date - Nov 09 , 2024 | 02:43 PM
Telangana: తెలంగాణ పోలీసులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు అమానుషంగా దాడి చేయటంపై మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధులపై కూడా దాడికి తెగబడటమేనా ఇందిరమ్మ రాజ్యమంటే అని నిలదీశారు.
హైదరాబాద్, నవంబర్ 9: హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై (MLA Kaushik Reddy) పోలీసులు అమానుషంగా దాడి చేయటంపై మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. దళితబంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణరహితంగా దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధులపై కూడా దాడికి తెగబడటమేనా ఇందిరమ్మ రాజ్యమంటే అని నిలదీశారు. ఇచ్చిన హామీలు అమలు చేయటం చేతగాని దద్దమ్మ రేవంత్ సర్కార్ అని... అడిగిన వారిపై దాడులు చేసే సంస్కృతికి తెరలేపిందని విమర్శించారు.
AP Govt: నామినేటెడ్ పదవుల రెండో జాబితా రిలీజ్
ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు పోలీసులు ఓవరాక్షన్ చేస్తే... తాము వచ్చాక తప్పకుండా మిత్తితో చెల్లిస్తామంటూ హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి అంటే సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పడు నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిపై రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నారని విమర్శించారు. మొన్న ఈ మధ్యనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే గాంధీతో గుండాగిరి చేయించి కౌశిక్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయినా వెనక్కి తగ్గకుండా ప్రజల కోసం పోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డిపై ఈసారి పోలీసుల ద్వారానే రేవంత్ రెడ్డి దాడి చేయించారన్నారు. ప్రశ్నిస్తే భయపడి దాడులకు పాల్పడే ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. కౌశిక్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ సైనికులెవరు భయపడని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా పోలీసులు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Ponnam Prabhakar: కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్
పోలీసుల అదుపులో కౌశిక్ రెడ్డి..
కాగా.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. హుజూరాబాద్ నియోజక వర్గంలో దళిత బంధు రెండో విడత రాని వాళ్లు తనకు దరఖాస్తు ఇవ్వాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దరఖాస్తు ఇవ్వడానికి వచ్చిన వారితో కలిసి స్థానిక అంబేద్కర్ చౌరస్తాకు బయలుదేరిన కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ధర్నాకు కౌశిక్ రెడ్డి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, దళితుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందుకు నిరసనగా వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారిపై దళిత కుటుంబాలు బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఇవి కూడా చదవండి..
Trump Tower: హైదరాబాద్‌లో ట్రంప్ టవర్లు
Read Latest Telangana News And Telugu News