TS NEWS: సీఎం రేవంత్ నాపై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. హరీశ్‌రావు హెచ్చరిక
ABN , Publish Date - Feb 27 , 2024 | 06:54 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతిసారి తన ఎత్తు గురించి వ్యాఖ్యానిస్తున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. తాను కూడా ఆయన ఎత్తు గురించి మాట్లాడితే సంస్కారవంతంగా ఉండదన్నారు. ఎవరెత్తు ఎంత అనేది ప్రజలకు అవసరం లేదని చెప్పారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతిసారి తన ఎత్తు గురించి వ్యాఖ్యానిస్తున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. తాను కూడా ఆయన ఎత్తు గురించి మాట్లాడితే సంస్కారవంతంగా ఉండదన్నారు. ఎవరెత్తు ఎంత అనేది ప్రజలకు అవసరం లేదని చెప్పారు. ప్రజలకోసం ఎవరెంత ఆలోచిస్తున్నారో, ఎవరెంత పనిచేస్తున్నారో మాత్రమే వారికి అవసరమని అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదన్నారు. ప్రజా సంక్షేమంలో లాభ, నష్టాలు చూసుకోరని చెప్పారు. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు తప్ప పాలకులు కారని మందలించారు. మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వందకు వందశాతం నల్లాల ద్వారా మంచినీరు ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు.
అప్పుడే అన్నీ అప్పులు ఎందుకు తెచ్చారు
కాళేశ్వరంపై విమర్శలు చేయడం తగదని చెప్పారు. 2007లో ప్రాణహిత- చేవెళ్లకు శంకుస్థాపన చేసి ఏడేళ్లు ఏ పనీ చేయకుండా ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చున్నారని విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని.. మొత్తుకున్నా కాంగ్రెస్ నేతలకు వినిపించదని అన్నారు. ఎస్.ఆర్.ఎస్.పి. ద్వారా అటు కోదాడ వరకు ఇటు డోర్నకల్ వరకు నీరందించగలిగామంటే అది కాళేశ్వరంతోనే అని వివరించారు. కొన్ని పెట్టుబడులకు ప్రత్యక్షంగా లాభం వస్తే, కొన్నింటికి పరోక్ష ఫలితాలుంటాయని అన్నారు. రైతుబంధు ద్వారా వేల కోట్లను రైతులకు అందించామని అన్నారు. లాభం లేని పథకం కాబట్టి దాన్ని రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రూపాయికి కిలో బియ్యం లాంటి పథకాల వల్ల కూడా ప్రత్యక్ష లాభం కనిపించదని... అయితే వాటిని కూడా రద్దు చేస్తారా..? అని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాకమందే వేల కోట్ల అప్పులు ఎందుకు తెచ్చారు..? అని ప్రశ్నించారు. ఇంకా తమపై విమర్శలు చేసి కాలక్షేపం చేయాలంటే కుదరదని హరీశ్‌రావు హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.