Share News

Harish Rao: కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు

ABN , Publish Date - Feb 17 , 2024 | 10:06 PM

కాంగ్రెస్ నేతలు ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ... డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.

Harish Rao: కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ... డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. శనివారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... ప్రాజెక్టులను కేఆర్ఎంబీకు అప్పగించకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై తాము పోరాడమని చెప్పారు. అసెంబ్లీలో తాము గొంతు విప్పాకే కేఆర్ఎంబీకు ప్రాజెక్టులను అప్పగించకుండా తీర్మానం చేశారని చెప్పారు. ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిని నిలదీశామని అన్నారు. ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం చేశారని.. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందన్నారు. అధికార ప్రతిపక్షం అసెంబ్లీలో సమన్యాయంగా ఉండాలి.. కానీ ఏక పక్షంగా వ్యవహారించారని మండిపడ్డారు. తాము కూడా ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని మీడియా ప్రచారం చేయాలని.. వాస్తవాలు తెలపాలని చెప్పారు. కాగ్ నివేదిక పనికి రాదని గతంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారని గుర్తుచేశారు. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కాగ్‌ను తప్పు పట్టారన్నారు. ఇదే కాగ్ తమను ఎన్నో సార్లు మెచ్చుకుందని తెలిపారు. ప్రాణహిత టెండర్లు వేయలేదని కాగ్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిందన్నారు. ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది వైట్ పేపర్ కాదని.. ఫాల్స్ పేపర్ అని ఎద్దేవా చేశారు. నాలుగు పార్లమెంట్ ఎంపీ సీట్ల కోసం భూతద్దం పెట్టీ చూపే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.

మేడిగడ్డను సాకుగా చూపుతున్నారు: హరీశ్ రావు

రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకపోతే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు పరిపాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. అసెంబ్లీలో తమను ఇరికించబోయి.. సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతల తప్పులను ఎత్తి చూపితే సమాధానం చెప్పకుండా దాటవేశారన్నారు. స్థిరీకరణ, ఆయకట్టు విషయంలో వాస్తవాలు దాచి పెట్టారని అన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ నేతలేనని.. తాము అసలు కాదని మందలించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేయలేక మేడిగడ్డను సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు, కరెంట్, రైతు బంధు ఇవ్వట్లేదన్నారు. తాము ప్రజల మధ్య ఉన్నామని... వారే మంద బలంతో తిట్టించే ప్రయత్నం చేశారని చెప్పారు. తాను సభలో మాట్లాడితే 8 మంది మంత్రులు అడ్డుకున్నారని... ప్రజలు ఇదంతా చూశారని తెలిపారు. కాంగ్రెస్ నేతల దగ్గర సమాధానం లేక తప్పించుకున్నారని మండిపడ్డారు. వాస్తవాలు బయటకు రాకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని.. సభలో అడ్డుకున్నా.. ప్రజల్లో తమను అడ్డుకోలేరని హరీశ్ రావు హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 17 , 2024 | 11:04 PM