ACB Raids: వామ్మో ఇదేం కక్కుర్తి.. శివ బాలకృష్ణ విచారణలో విస్తుపోయే విషయాలు!
ABN , Publish Date - Feb 03 , 2024 | 09:57 PM
హెచ్ఎండీఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ(HMDA Director Siva Balakrishna)ను నాలుగో రోజు ఏసీబీ అధికారులు విచారించారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్: హెచ్ఎండీఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ(HMDA Director Siva Balakrishna)ను నాలుగో రోజు(శనివారం) ఏసీబీ అధికారులు విచారించారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో పెట్టుబడులపై ఇవాళ ప్రధానంగా విచారణ జరిగింది. రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు ఎవరెవరు బాలకృష్ణకు బినామీలుగా వ్యవహారించారనే దానిపై లోతుగా విచారించారు. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్‌ను కూడా ఏసీబీ కార్యాలయానికి పిలిపించి.. అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విచారణలో సమాధానాలు చెప్పలేక మౌనంగా ఉండిపోయారని తెలియవచ్చింది.
వామ్మో.. కంగుతిన్న ఏసీబీ!
బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు అధికారులు తేల్చారు. ఆయన పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. బాలకృష్ణకు ఉన్న కాసుల కక్కుర్తిపై అధికారులు విచారణలో కొత్త విషయాలు బయట పడుతుండడంతో షాక్‌కు గురవుతున్నారు. రెరా ఆఫీస్ నాలుగో అంతస్తులోని బాలకృష్ణ ఛాంబర్‌లో లాకర్‌ను అధికారులు బ్రేక్ చేశారు. రూ.12 లక్షలు విలువ చేసే చందనపు చీరలు, రూ.20 లక్షలకు పైగా నగదు లభ్యమైంది. వాటితోపాటు బాలకృష్ణ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు ఫొటో ఆల్బమ్‌లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన భూముల పాసు పుస్తకాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎవరీ బాలకృష్ణ..?
కాగా.. రెరా కార్యదర్శి శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. శివబాలకృష్ణను సస్పెన్షన్‌పై హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ దాన కిశోర్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా కూడా ఆయన పని చేశారు. రెరా ఇంచార్జి కార్యదర్శిగా కూడా పని చేశారు. అయితే ఐదు రోజుల క్రితం శివ బాలకృష్ణ, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.