Share News

Metrological Department:హైదరాబాద్‌లో భారీ వర్షం

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:44 AM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. చార్మినార్‌ సర్దార్‌ మహల్‌లో అత్యధికంగా 4.8, వారాసిగూడ బౌద్ధ నగర్‌లో 4.7 సెం.మీ వర్షం కురిసింది. రామాంతాపూర్‌, కాప్రా, హయత్‌నగర్‌, బండ్లగూడ, అంబర్‌పేట, నాచారం, హబ్సిగూడ ప్రాంతాల్లో 4 సెం.మీ.కుపైగా వాన పడింది.

Metrological Department:హైదరాబాద్‌లో భారీ వర్షం

  • పలు ప్రాంతాల్లో 4 సెం.మీ.కు పైగా నమోదు

  • నిర్మల్‌, నిజామాబాద్‌, యాదాద్రి జిల్లాల్లో వాన

  • నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. చార్మినార్‌ సర్దార్‌ మహల్‌లో అత్యధికంగా 4.8, వారాసిగూడ బౌద్ధ నగర్‌లో 4.7 సెం.మీ వర్షం కురిసింది. రామాంతాపూర్‌, కాప్రా, హయత్‌నగర్‌, బండ్లగూడ, అంబర్‌పేట, నాచారం, హబ్సిగూడ ప్రాంతాల్లో 4 సెం.మీ.కుపైగా వాన పడింది. ముషీరాబాద్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.

ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌ స్టేడియం, చిక్కడపల్లి, గాజులరామారం ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాం సమస్యలు తలెత్తాయి. చందానగర్‌, మియాపూర్‌, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్‌, సూరారం, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌, సుచిత్ర సెంటర్‌, నిజాంపేట బాచుపల్లి ప్రగతినగర్‌ ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్లలోతు వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

నగరంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని బేగంపేట వాతావరణ శాఖ తెలిపింది. ఇక, ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వర్షం పడింది. ఉట్నూర్‌ మండలంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. మండలంలోని కొలాంగూడ వద్ద రోడ్డుపై భారీ వృక్షం పడిపోవడంతో ఇటు వైపు కొత్తగూడ చెక్‌పోస్టు వరకు, అటు దంతనపల్లి కొలాంగూడ వరకు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అలాగే ఉట్నూర్‌-మంచిర్యాల ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ వాన కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల కేంద్రంలో భారీగా, వలిగొండలో మోస్తరు వర్షం పడింది.


  • నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

పలు జిల్లాల్లో బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతారణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల, వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, హన్మకొండ, మేడ్చల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

కాగతూర్పు పసిఫిక్‌ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ మార్పుతో ఎల్‌నినో స్థితి నుంచి లానినోకు మారతున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసె్‌స(ఇంకోయిస్‌) అంచనా వేసింది. పసిఫిక్‌ మహా సముద్రంపై లానినో పరిస్థితులు సంభవిస్తే అవి నైరుతి రుతుపవనాలకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని అభిప్రాయపడింది. సాధారణంగా లానినో స్థితి ఎక్కువగా జూలై-సెప్టెంబరు మధ్య ఉంటుందని, అది 2025 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.

Updated Date - Jun 12 , 2024 | 03:44 AM