Share News

HYDRA: టాలీవుడ్ సీనియర్ నటుడికి హైడ్రా నోటీసులు.. కూల్చకపోతే కూల్చేస్తాం అంటూ హెచ్చరిక

ABN , Publish Date - Sep 08 , 2024 | 08:34 AM

భాగ్యనగరంలో కుచించుకుపోయిన జలవనరులతోపాటు, ప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చెరనుంచి విడిపించడమే ధ్యేయంగా హైడ్రా ముందుకుసాగుతోంది.

HYDRA: టాలీవుడ్ సీనియర్ నటుడికి హైడ్రా నోటీసులు.. కూల్చకపోతే కూల్చేస్తాం అంటూ హెచ్చరిక

హైదరాబాద్: భాగ్యనగరంలో కుచించుకుపోయిన జలవనరులతో పాటు, ప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చెరనుంచి విడిపించడమే ధ్యేయంగా హైడ్రా ముందుకు సాగుతోంది. తరతమ భేదాలు లేకుండా ఆక్రమణలు జరిగినట్లు తేలితే ఉపేక్షించట్లేదు. దీంతో ఇన్నాళ్లు తమకు ఎదురేలేదని భావించిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఎన్.. తర్వాత జే!

మొన్నటికి మొన్న మాదాపూర్‌లోని తుమ్మడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ని కట్టారనే ఆరోపణలతో రంగంలోకి దిగిన హైడ్రా (HYDRA) అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు. కన్వెన్షన్ యజమాని హీరో అక్కినేని నాగార్జున హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలోపే ఎన్ కన్వెన్షన్‌ని నేలమట్టం చేశారు. ఇలా భాగ్యనగర వ్యాప్తంగా ఆక్రమణల తొలగింపుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తాజాగా టాలీవుడ్‌ సీనియర్ నటుడికి హైడ్రా నోటీసులు పంపింది.


jayabheri.jpg

ఆక్రమణలు నిజమే..

మురళీ మోహన్‌కు (Murali Mohan) చెందిన జయభేరి(Jayabheri) సంస్థకు హైడ్రా నుంచి నోటీసులు వెళ్లాయి. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగలాల్ కుంట చెరువులో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో జయభేరి సంస్థ అక్రమంగా నిర్మాణాలు జరిపిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువును పరిశీలించి.. ఆక్రమణలు నిజమేనని తేల్చారు. జయభేరి సంస్థకు నోటీసులు అందజేశారు.

15 రోజులే టైమ్..

15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే తామే కూల్చేస్తామని అందులో పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. నోటీసులపై మురళీమోహన్ తదుపరి అడుగు ఎలా ఉండబోతోందని దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్ కన్వెన్షన్ విషయంలో హైడ్రా అధికారులు అవలంభించిన ధోరణి సీనియర్ నటుడికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నోటీసులపై మురళీమోహన్ న్యాయ సలహా కోరుతున్నట్లు, అవసరాన్ని బట్టి న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

For Latest News click here

Updated Date - Sep 08 , 2024 | 09:53 AM