KCR: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా లేదు: కేసీఆర్
ABN , Publish Date - Jun 15 , 2024 | 02:28 PM
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి(Justice Narasimha Reddy) కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) అన్నారు. ఈ మేరకు విద్యుత్ విచారణ కమిషన్‌కు 12పేజీల లేఖ(12Pages Letter)ను కేసీఆర్ పంపించారు. చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించారంటూ నరసింహారెడ్డిపై లేఖలో మండిపడ్డారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి(Justice Narasimha Reddy) కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) అన్నారు. ఈ మేరకు విద్యుత్ విచారణ కమిషన్‌కు 12పేజీల లేఖ(12Pages Letter)ను కేసీఆర్ పంపించారు. చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించారంటూ నరసింహారెడ్డిపై లేఖలో మండిపడ్డారు.
కేసీఆర్ మాట్లాడుతూ.." విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89శాతం ఏపీకి 46.11శాతం విద్యుత్ కేటాయించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏ మాత్రం సరిపోదు. తెలంగాణ వచ్చే నాటికి 5వేల మెగావాట్ల కొరతతో రాష్ట్ర విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది. పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర విభజన నాటికి 7,778మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో 20వేల మెగావాట్లకు పైగా తీసుకెళ్లాం. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ఈఆర్సీకి అభ్యంతరాలు చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోద ముద్ర వేసింది. ఈఆర్సీ నిర్ణయాలపై రేవంత్ రెడ్డికి అభ్యంతరాలు ఉంటే ఆనాడే ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టును ఆశ్రయించే వారు.. కానీ ఎలాంటి అప్పీల్‌కు వెళ్లలేదు" అని అన్నారు.
Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..
ఈఆర్సీ తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధం..
ఈఆర్సీ తీర్పులపై ఎంక్వైరీలు, కమిషన్లు వేయకూడదన్న కనీస జ్ఞానం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోందని కేసీఆర్ లేఖలో మండిపడ్డారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరూ(జస్టిస్ నరసింహారెడ్డి) ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచించకపోవడం విచారకరమన్నారు. మీరు అన్ని అంశాలను పరిశీలించకుండా నాపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తప్పుపడుతూ అభ్యంతరాలను తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. 2014నాటికి సబ్ క్రిటికల్‌పై ఎలాంటి నిషేధం లేదు. 12 వ పంచవర్ష ప్రణాళిక కూడా సబ్ క్రిటికల్ ధర్మల్ ప్లాంట్ నిర్మించుకోవచ్చని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే సబ్ క్రిటికల్ ప్లాంట్ పెట్టి తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చట్టబద్ధంగా అనుమతులు తీసుకునే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ ప్రారంభించామని కేసీఆర్ లేఖలో వివరించారు.
CS Shantikumari :ఆరుగురుకి డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతి
బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు కమిషన్ ఏర్పాటు..
రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు కాళేశ్వరం, విద్యుత్ కమిషన్లు ఏర్పాటు చేశారని కేసీఆర్ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేస్తూ అప్పటి ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. జస్టిస్ నరసింహారెడ్డి విచారించే అర్హతను కోల్పోయారని, బాధ్యతల నుంచి విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్షతో గత ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని ధ్వజమెత్తారు. 24 గంటల కరెంటు సరఫరాను తక్కువ చేసి చూపించే ప్రయత్నం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఎంతో బాధించాయి..
విద్యుత్ విచారణ కమిషన్ ఛైర్మన్‌గా నరసింహారెడ్డి మాటలు ఎంతో బాధ కలిగించాయని కేసీఆర్ అన్నారు. జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు పంపుదామని అనుకున్నా. కానీ ఈలోపే మీరు ఎంక్వైరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా నా పేరు ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే ఏదో దయతలచి ఇచ్చినట్లు మాట్లాడటం చాలా బాధ కలిగించింది. మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతో మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థ అవుతోంది. మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. విచారణ పూర్తికాకముందే తీర్పు ప్రకటించినట్లుగా మీ మాటలు ఉన్నాయి. విచారణ నిష్పక్షపాతంగా కనిపించడం లేదు. నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టం అవుతోంది. ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నరసింహారెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి:
ప్రముఖ వ్యంగ్య, హాస్య రచయిత..నండూరి పార్థసారథి కన్నుమూత