Share News

Formula E race: ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కీలక పరిణామం

ABN , Publish Date - Dec 28 , 2024 | 02:56 PM

Telangana: ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈడీకి ఏసీబీ అందజేసింది. ఏసీబీ ఇచ్చిన వివరాలను ఈడీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఈడీ విచారణను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.

Formula E race: ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కీలక పరిణామం
Formula E Race Case

హైదరాబాద్, డిసెంబర్ 28: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులోని వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఏసీబీ అందజేసింది. ఈ కేసుకు సంబంధించి ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్‌ఎండీఏ చెల్లింపుల వివరాలు, హెచ్‌ఎండీఏ చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్‌ఐఆర్‌ను ఈడీకీ ఏసీబీ అందజేసింది. అలాగే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్‌లో కీలక అంశాలను ఏసీబీ ప్రస్తావించింది. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డారని కౌంటర్లో ఏసీబీ పేర్కొంది. కేబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేశారని.. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు రూ.55 కోట్లు బదిలీ చేశారని తెలిపారు. దీని వలన హెచ్ఎండీఏకు రూ.8 కోట్లు అదనపు భారం పడిందని... అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని అడగడం దర్యాప్తును అడ్డుకోవడమే అని వెల్లడించింది. కేటీఆర్ వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏసీబీ కౌంటర్‌లో పేర్కొంది. అధికారుల నుంచి అనుమతి పొందిన తర్వాతనే కేటీఆర్‌పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏసీబీ తెలిపింది.


రాజకీయ కక్షతోనో, అధికారులపై ఒత్తిళ్లతోనూ కేసు నమోదు చేశామనడం సరైనది కాదని వెల్లడించింది. మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించారని తెలిపింది. ఎఫ్ఈఓకు చెల్లింపులు జరపాలని స్వయంగా కేటీఆర్ వెల్లడించినట్లు తానే చెప్పారని.. ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ ఆలస్యం అయినందున కేసు కొట్టివేయాలని కోరడం సరైంది కాదని ఏసీబీ తెలిపింది. తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయవచ్చన్న సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయన్న కౌంటర్‌లో ఏసీబీ పేర్కొంది.

హైదరాబాద్‌లో ఏపీ వాసులకు సంక్రాంతి కానుక..


మరోవైపు ఈకేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7 విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అలాగే ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎమ్ డీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి కూడా ఈడీ నోటీసులు పంపింది. వారిని జనవరి 2,3 తేదీల్లో తమ ముందుకు విచారణకు హాజరుకావాల్సింది ఈడీ నోటీసుల్లో తెలిపింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌ వేసిన క్వాష్ పిటిషన్‌పై నిన్న(శుక్రవారం) హైకోర్టులో విచారణకు రాగా.. డిసెంబర్ 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే కేటీఆర్‌ నాట్ టు అరెస్ట్ ఆదేశాలను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ వేయగా.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేటీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి..

డాక్యుమెంటరీలో ఏం చెప్పారంటే..

రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 28 , 2024 | 02:57 PM