Share News

Telangana Politics: ‘రేవంత్ దమ్ముంటే రా’.. కేటీఆర్ సవాల్..

ABN , Publish Date - Aug 22 , 2024 | 02:23 PM

రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి సవాల్ విసిరారు. రేవంత్‌కు దమ్ముంటే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలని పిలిచారు. రుణమాఫీ జరిగిందో.. లేదో గ్రామాల్లోకి వెళ్లి అడుగుదామని అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు..

Telangana Politics: ‘రేవంత్ దమ్ముంటే రా’.. కేటీఆర్ సవాల్..
KTR Challenge to CM Revanth Reddy

హైదరాబాద్, ఆగష్టు 22: రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి సవాల్ విసిరారు. రేవంత్‌కు దమ్ముంటే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలని పిలిచారు. రుణమాఫీ జరిగిందో.. లేదో గ్రామాల్లోకి వెళ్లి అడుగుదామని అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రూ. 2 లక్షలు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ భారీ ధర్నా చేపట్టింది. చేవెళ్లలో నిర్వహించిన ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ‘రైతు రుణమాఫీ చెయ్యకపోతే నీ లాగుల్లో తొండలు వదిలి రుణమాఫీ అయ్యేదాకా వదిలిపెట్టం’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.


బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని.. భారత రైతు సమితి కూడా అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వెండపడుతామన్నారు. రైతు రుణమాఫీ అని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ కేటీఆర్ నినదించారు. మూడు రోజుల క్రితం నర్కోడా గ్రామానికి వెళ్లానని.. గ్రామాల్లో ఇప్పుడు కళ తప్పిందని అక్కడి ప్రజలు అన్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.


డిసెంబర్ 9 నాడు అధికారంలోకి రాగానే రైతు రుణమాఫి చేస్తానని సోనియా గాంధీ మీదా ఒట్టు వేసి చెప్పాడని రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రైతుల రుణమాఫి కావాలంటే రూ. 49 వేల కోట్లు ఖర్చు అవుతుందని బ్యాంకు అధికారులు చెప్పారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో దేవుల్ల మీద ఒట్టు పెట్టారని.. రైతు రుణమాఫి చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ‘దేవెళ్ళు కూడా అడుగుతున్నారు.. రేవంత్ రెడ్డి ఎక్కడకి పోయాడని.. మమ్మల్ని మోసం చేశాడని.’ అని తనదైన శైలిలో సీఎంపై విరుచుకుపడ్డారు కేటీఆర్. డబ్బులు లేక రైతు రుణమాఫీ విషయంలో కొర్రీలు పెట్టారని దుయ్యబట్టారు. రూ. 31 వేల కోట్లు అవసరమని కేబినెట్‌లో పెట్టారని.. బడ్జెట్‌లో చూస్తే రూ. 26 వేల కోట్లే పెట్టారని విమర్శించారు. ఇదే అంశంపై అసెంబ్లీలో తాము ప్రశ్నిస్తే తమ మైక్‌లు కట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు.


సబితక్క ఏం అనలేదు..

ఇదే సమయంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అసెంబ్లీలో జరిగిన అవమానంపైనా కేటీఆర్ మాట్లాడారు. ‘అసెంబ్లీలో సబితక్క పాపం ఒక్క మాట అనలేదు. ఇంట్లో దోమలు కుడుతున్నాయి.. ఇంటి బయలకు పోతే కుక్కలు కరుస్తున్నాయి అని అసెంబ్లీలో సబితక్క మాట్లాడింది. అక్కలను నమ్ముకుంటే నీ బ్రతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుందని సబితమ్మను టార్గెట్ చేశారు రేవంత్. నిండు శాసనసభలో సబితక్కను అవమానించారు.’ అని సీఎం రేవంత్ రెడ్డి తీరును తూర్పారబట్టారు.


చావు డబ్బులు కొడుతున్న రైతులు..

రైతు రుణమాఫీ కాలేదని రైతులందరూ ఇవాళ రేవంత్ రెడ్డి చావు డబ్బు కొడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదన్నారు. కొండారెడ్డిపల్లి రైతుల దగ్గరకు పోదామని తాను సవాల్ చేస్తే.. తన సవాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించలేదు ఎద్దేవా చేశారు. కొండారెడ్డిపల్లిలో రైతు రుణమాఫి జరిగిందని రైతులు చెబితే తాను వెంటనే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. రూ. 7,500 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ జరిగిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బ్యాంకర్లతో అంటున్నారని.. ఎటువంటి ఆంక్షలు లేకుండా రూ. 2 లక్షల రైతు రుణమాఫి చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తిగా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రైతుబంధు కోత పెట్టేందుకు కూడా రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు.


Also Read:

అధైర్యపడొద్దు.. అండగా ఉంటా..!!

కవితకు మళ్లీ అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

స్వీట్ కార్న్ ఇష్టంగా తినేవారికి ఈ నిజాలు తెలిసుండవు..!

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 22 , 2024 | 02:23 PM