Minister Jupalli: మతాల పేరుతో బీజేపీ దేశాన్ని ముక్కలు చేసి చిచ్చు పెడుతోంది
ABN , Publish Date - Mar 04 , 2024 | 10:50 PM
మతాల పేరుతో బీజేపీ దేశాన్ని ముక్కలు చేసి చిచ్చు పెడుతున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) ఆరోపించారు. నేడు ఆదిలాబాద్‌లో జరిగిన బీజేపీ(BJP) సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
హైదరాబాద్: మతాల పేరుతో బీజేపీ దేశాన్ని ముక్కలు చేసి చిచ్చు పెడుతున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) ఆరోపించారు. నేడు ఆదిలాబాద్‌లో జరిగిన బీజేపీ(BJP) సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సోమవారం నాడు తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ అని చెప్పారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పారు. నీళ్ల కోసం తెలంగాణ పోరాటం సాగిందని.. నీటి వాటాలను ఎందుకు తెల్చడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణా నీటి సమస్యలను ఎందుకు త్వరగా పరిష్కరించడం లేదని నిలదీశారు. రెండు రాష్ట్రాల మధ్య తగాదాలు పెడుతుందే కేంద్ర బీజేపీ అని మండిపడ్డారు. నీటి వాటాలను తెల్చనప్పుడు ఓట్లు అడిగే హక్కు ఎక్కడిది? అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు? అని నిలదీశారు. గాంధీ కుటుంబం దేశం కోసం ఆస్తి, ప్రాణ త్యాగం చేసిందని చెప్పారు.
ఆధారాలు లేకుండా ప్రధాని స్థాయిలో నిరాధార ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై మాట్లాడే మోదీ.. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఎందుకు విచారణ చేయడం లేదని నిలదీశారు. ప్రైవేట్ సంస్థలను పోషిస్తూ... పబ్లిక్ సెక్టార్‌ను మూసివేసే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్‌పై మోదీ చేసిన ఆరోపణలు అసత్యమని చెప్పారు. రాముడి విగ్రహం పెట్టడం కాదని అలాంటి పాలన కూడా ఇవ్వాలని సూచించారు. మోదీ రాజకీయాల కోసమే విమర్శలు చేశారన్నారు. పార్లమెంట్‌లో కృష్ణ నది జలాలపై నిర్ణయం తీసుకున్న తర్వాతే ఓట్లు అడగాలని చెప్పారు. ప్రభుత్వ ఆరు గ్యారెంటీలపై మోదీ విమర్శలు చేయడం సరికాదన్నారు. మూడు నెలల్లో 4 గ్యారెంటీలు అమలు చేశామని మిగతావి కూడా త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని తేల్చిచెప్పారు. పాతాళంలోకి పోతున్న గులాబీ పార్టీను బతికించాడానికి మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ - బీజేపీకి చెరో ఒకటి రెండు స్థానాలు వస్తే గొప్ప అని చెప్పారు. కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు వస్తాయని అన్నారని.. ఏమైందో అందరికి తెలుసిందేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.