Hyderabad: ఆ కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి పొన్నం..
ABN , Publish Date - Dec 07 , 2024 | 03:23 PM
ఈనెల 9న సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందజేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈనెల 9న సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందజేశారు.
ముందుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మంత్రి పొన్నం బృందం చేరుకుంది. వారికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రి పొన్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆహ్వాన పత్రిక అందజేసి ఈనెల 9న జరిగే కార్యక్రమానికి తప్పుకుండా రావాలంటూ పిలిచారు. అనంతరం తన నివాసానికి వచ్చిన పొన్నం బృందానికి కేసీఆర్ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను నేతలు నెమరు వేసుకున్నారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ వస్తారా లేదా? అనే దానిపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.
హైకోర్టులో పిటిషన్..
కాగా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకకు అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహానికి సంబంధించిన నమూనాను సైతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఆపాలంటూ రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలైంది. విగ్రహ ఏర్పాటును అడ్డుకోవాలంటూ హైకోర్టును తెలంగాణ తొలి బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ ఆశ్రయించారు. ఈనెల 9న జరిగే కార్యక్రమాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
విమలక్క ఏం అన్నారంటే..
మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ఇంత పెద్దఎత్తున చర్చ అవసరమా? అంటూ ప్రజా గాయకురాలు విమలక్క ప్రశ్నించారు. తెలంగాణ తల్లిపై చర్చ జరగడం చాలా బాధగా ఉందని ఆమె అన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూనే ఉన్నామని, మారిన ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగించడం లేదని విమలక్క అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ఇప్పటికే నిరసన మొదలైందని, ఎక్కడ విజయం సాధించారని విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన పనితీరుపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ కోసం పోరాడితే వరసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని విమలక్క ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: వారిని బయటకు తీసుకువచ్చే వరకూ పోరాటం చేస్తాం: కేటీఆర్..
Children: ఆడుకుంటుండగా చిన్నారి ఏం చేసిందంటే..