Share News

Ponnam Prabhakar: కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Nov 09 , 2024 | 02:32 PM

బలహీన వర్గాలను అవమానించే విధంగా లక్ష్మణ్ మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వ్యతిరేకమని చెప్పారు.

Ponnam Prabhakar: కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్: కులగణనకు బీజేపీ అనుకూలమా కాదా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశవ్యాప్తంగా సర్వే చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తారా లేదా అని నిలదీశారు. తెలంగాణలో కులగణన సర్వేపై లక్ష్మణ్ అభిప్రాయం చెప్పాలని ప్రశ్నించారు. ఇవాళ(శనివారం)గాంధీ భవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల కోసం కులగణన జరుపుతున్నామని బీజేపీ నేతలు అంటున్నారని అన్నారు. సర్వేను అడ్డుకోవాలని చూస్తే లక్ష్మణ్ ద్రోహిగా మిగిలిపోతారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.


స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలా వద్దా అని నిలదీశారు. బీజేపీ ఎన్నికల్లో పూర్తిగా మతం రంగును పూసిందని ఆరోపించారు. లక్ష్మణ్ మీద గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. బలహీన వర్గాలను అవమానించే విధంగా లక్ష్మణ్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు బీజేపీ వ్యతిరేకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.


బీజేపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

‘‘బీజేపీ నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాజస్థాన్‌లో రిజర్వేషన్ అమలు చేస్తుంటే హేమంత్ సొరేన్‌ను అరెస్ట్ చేశారు. వీపీ సింగ్ రిజర్వేషన్లు తెస్తే కమండలం పేరు మీద పదవి నుంచి తప్పించారు. బలహీన వర్గాలకు చెందిన మోదీ బీసీల కోసం పదేళ్లలో ఏమైనా చేశారా చెప్పాలి. తెలంగాణలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి బీసీ అధ్యక్షుడిని తీసేశారు. సివిల్ సొసైటీలో అందరి అబిప్రాయం తీసుకుని కులగణన చేస్తున్నాం. కులగణనకు అడ్డం పడటానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వం ఏ డాక్యుమెంట్ అడగట్లేదు. సమాచారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుంది. బీఆర్ఎస్ సర్వే చేపట్టలేకపోయింది. మేము చేస్తున్నాం సహకరించండి. మూసీ పరివాహక ప్రాంత ప్రజల జీవన విధానం మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేస్తున్నారు. మీరు చేయలేని ప్రక్షాళన మేము చేస్తున్నాం సహకరించాలి.. వీలయితే సపోర్ట్ చేయాలి’’ అని మంత్రి పొన్నం ప్రబాకర్ అన్నారు.


చట్టాన్ని చేతుల్లోకి తీసుకోము..

‘‘మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ అన్నట్లు కులగొట్టిన ప్రాంతాలకు వస్తాం. పదేళ్లు అధికారంలో ఉన్న వారు, వారిచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయి. ముందుగా చెప్పాలి. కిషన్ రెడ్డి ఏవిధంగా హైదరాబాద్‌కు ఉపయోగపడుతున్నారో టవర్ సర్కిల్ దగ్గర చర్చకు సిద్ధమా అంటే సప్పుడు చేయలేదు. జైలు కట్టినం కేసీఆర్ కుటుంబం అంతా జైలుకే అని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్‌ని పామ్‌హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేయట్లేదని బండి సంజయ్ అంటున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మేము అరెస్ట్ చేయం. కేటీఆర్ , కేసీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేస్తామని మేము అనలేదు. పదేళ్లు అధికారంలో ఉండి ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ పట్టింది మీరు కాదా. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాబోయే పార్లమెంట్ సెషన్‌లో ఢిల్లీకి వెళ్లి కోట్లాడతాం. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండక పోతే మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad: ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్‌ వద్ద అనుకోని ఘటన.. భయంతో జనం పరుగులు

Minister Narayana: జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ.. మంత్రి నారాయణ వార్నింగ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 09 , 2024 | 02:40 PM