TS Politics: హరీశ్ రావు బీజేపీలోకి వెళ్లడం ఖాయం.. మైనంపల్లి హాట్ కామెంట్స్
ABN , First Publish Date - 2024-02-06T22:23:51+05:30 IST
మాజీమంత్రి సీనియర్ నేత హరీశ్ రావు, కల్వకుంట్ల కుటుంబాన్ని బొందపెట్టేవరకు నిద్ర పోనని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు(Mynampally Hanumanth Rao) తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం నాడు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయానికి భూమి పూజ చేశారు.
సిద్దిపేట: మాజీమంత్రి సీనియర్ నేత హరీశ్ రావు, కల్వకుంట్ల కుటుంబాన్ని బొందపెట్టేవరకు నిద్ర పోనని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు(Mynampally Hanumanth Rao) తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం నాడు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయానికి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో మైనంపల్లి హన్మంతరావు, మెదక్ ఎమ్మల్యే రోహిత్ రావు, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల ఇన్‌చార్జీలు పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ... మాజీమంత్రి కేటీఆర్, హరీశ్‌లపై మైనంపల్లి హాట్ కామెంట్స్ చేశారు. సిద్దిపేటకు మళ్లీ మళ్లీ వస్తునే ఉంటానని తెలిపారు. 23 ఏళ్లుగా ఉద్యమం పేరిట అందరినీ వాడుకున్నారని మండిపడ్డారు. వారిద్దరూ ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ తనకన్నా పదేళ్ల చిన్నవాడని మైనంపల్లి హన్మంతరావు అన్నారు.
తన దెబ్బకు వారు పారిపోవాలి
చీమలు పెట్టిన పుట్టలో కేటీఆర్ దూరాడని ఆరోపించారు.176 ఓట్లతో గెలిచిన కేటీఆర్ ఈ రోజు సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేస్తున్నారని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. హైదరాబాద్‌ను కేటీఆర్ కబ్జా చేశారని విమర్శించారు. తాను స్వయం శక్తితో రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. రామాయంపేటలో 2008లో ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి తాను గెలిచానని తెలిపారు. ‘నేను ఒక బ్రాండ్.. నాకు ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు.. నేనే ఒక పవర్’ అని చెప్పారు. రేవంత్ రెడ్డిని ఎన్ని కష్టాలు పెట్టిన తనను తాను ప్రూవ్ చేసుకున్నారని తెలిపారు. తన దెబ్బకు కేటీఆర్, హరీశ్ రావు పారిపోవాలన్నారు. వారిని బొందపెట్టే వరకు ప్రాణంతో ఉంటానని హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్‌లో వారిద్దరూ తప్ప ఎవరినైనా మాట్లాడనిచ్చారా ? అని ప్రశ్నించారు. మీది అడ్రస్ లేని కుటుంబం.. ఇక అడ్రస్ లేకుండానే పోతారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రజలకు మంచి చేయాలని వారి మీద కాన్సంట్రేట్ చేయడం లేదన్నారు.లేదంటే వారు రోజుకొకరూ జైలుకి పోతారని హెచ్చరించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పైసలిచ్చి వ్యవస్థను నాశనం చేశారని మైనంపల్లి హన్మంతరావు విమర్శించారు.
కాంగ్రెస్ నేతలపై ఈగ వాలినా హరీశ్ రావు ఇంటిపైకి వస్తా..
బీఆర్ఎస్ నేతలది ఆర్టిఫీషియల్ అని.. తమది ఒరిజినల్ అని చెప్పారు. ‘నా ఇంటికి హరీశ్ రావు వస్తానన్నాడు .. ఎప్పుడు వస్తాడో చెప్పు.. ఒక్కడినే ఉంటా’ అని మైనంపల్లి హన్మంతరావు సవాల్ విసిరారు. డబుల్ బెడ్ రూం, దళిత బంధు ఇవ్వని వీరా తమను ప్రశ్నించేది అని నిలదీశారు. వారు రాష్ట్రానికే మంత్రులుగా చేసి ఎన్ని నియోజకవర్గాలు డెవెలప్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గుడిసెల ఉన్నోళ్లు అక్కడే ఉన్నారు.. వారు మాత్రం భోగభాగ్యాలు అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను గెలిచినా ఓడినా ఒక మాట మీదనే ఉంటానని తెలిపారు. సిద్దిపేటలో కాంగ్రెస్ నేతలపై ఈగ వాలినా అర్థరాత్రి హరీశ్ రావు ఇంటిపైకి వస్తా ? నని హెచ్చరించారు. అసెంబ్లీలో బావ, బామ్మర్ది మాత్రమే మాట్లాడుతున్నారని అన్నారు. చర్యకు ప్రతి చర్య తప్పదని మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు.
ఆ ఎన్నికల్లో కోట్లల్లో పైసలిచ్చి ఓట్లు కొన్నారు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి, ఎమ్మెల్యేలకు ఇజ్జత్ లేదన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీదని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఆరు నెలల్లో ప్రభుత్వం పడి పోయిందని ప్రగల్బాలు పలుకుతున్నారని మైనంపల్లి హన్మంతరావు మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల లోపే 27 మంది ఎమ్మల్యేలు కాంగ్రెస్ లోకి రాకుంటే తన పేరు హన్మంతరావు కాదని అన్నారు. కేసీఆర్, హరీశ్, కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు చెప్పులతో కొడతారని వార్నింగ్ ఇచ్చారు.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లల్లో పైసలిచ్చి ఓట్లు కొన్నారని ఈ పైసలన్నీ ఎవరి సొమ్మని ప్రశ్నించారు. వచ్చే ఐదేళ్లలో బీఆర్‌ఎస్ ఉండదని.. హరీశ్ రావు బీజేపీలోకి పోతారని మైనంపల్లి హన్మంతరావు అన్నారు.