Rajagopal Reddy: దమ్ముంటే కేసీఆర్‌ను సభకు రమ్మనండి
ABN , Publish Date - Feb 14 , 2024 | 01:37 PM
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు ఉపయోగిస్తున్న భాష అభ్యంతరకరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు.. ప్రస్తుత సీఏం రేవంత్ రెడ్డిపై అలాంటి భాష వాడడం బాధాకరమన్నారు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు ఉపయోగిస్తున్న భాష అభ్యంతరకరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు.. ప్రస్తుత సీఏం రేవంత్ రెడ్డిపై అలాంటి భాష వాడడం బాధాకరమన్నారు. అన్ని పార్టీల సీనియర్లం కలిసి కొత్త ఎమ్మెల్యేలకు ఆదర్శంగా ఉందామని పేర్కొన్నారు. అన్ పార్లమెంటరీ భాష ఉంటే రికార్డుల నుంచి తప్పకుండా తొలగిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తాము తప్పకుండా ఆదర్శంగా ఉంటామన్నారు. రేపు సభలో బలహీనవర్గాలకు సంబంధించిన తీర్మాణం పెడతామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి అనేది పార్టీ అంతర్గత వ్యవహారమని.. తనకు మంత్రి రాలేదని చెబుతూ పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నారన్నారు. తమలో తమకు చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలని కలలు కంటున్నారన్నారు. బీఆర్ఎస్ పాచికలు పారవని.. వాళ్ల కుట్రలు సాగవన్నారు. దమ్ముంటే కేసీఆర్‌ని సభకు రమ్మనండంటూ రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. గత ప్రభుత్వ వైఫల్యాలు బయట పెడుతుంటే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక పోతున్నారన్నారు. పదేళ్లు పరిపాలించి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్‌దని దుయ్యబట్టారు. త్యాగాలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన ఒక్క కుటుంబం.. లక్షల కోట్లను దోచుకుందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.